గర్భవతి అయిన భార్యను హాస్పిటల్ కు తీసుకువెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి భార్యాభర్తలిద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. 

శ్రీకాకుళం: కరోనా నుండి సురక్షితంగా బయటపడినా రోడ్డు ప్రమాదం ఆ దంపతులను బలితీసుకుంది. గర్భవతి అయిన భార్యను హాస్పిటల్ కు తీసుకువెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి భార్యాభర్తలిద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చిట్టివలసకు చెందిన యోగేశ్వర్(27), రోహిణి(22) భార్యాభర్తలు. కొద్దిరోజుల క్రితమే కరోనాబారిన పడ్డ వీరు సురక్షితంగా బయటపడ్డారు. ఇలా కరోనా నుండి కోలుకున్న వెంటనే ఈ దంపతులకు శుభవార్త తెలిసింది. రెండురోజుల క్రితమే రోహిణి గర్భవతి అని తెలియడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది. ఈ ఆనందం కొద్దిరోజులు కూడా నిలవకుండానే విషాదం చోటుచేసుకుంది.

read more చెల్లి వరసయ్యే మైనర్ తో యువకుడి ప్రేమాయణం... ఇద్దరూ బలి

భార్యకు వైద్యపరీక్షలు చేయించడానికి విశాఖపట్నంకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు దంపతులు. ఈ క్రమంతో కనిమెట్ట పైవంతెన వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. ఆ ధాటికి పక్కనే ఉన్న డివైడర్‌ను బైక్‌ బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రగాయాలతో దుర్మరణం చెందారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల నుండి దంపతులిద్దరు చనిపోయారని సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.