ఓ వ్యక్తి వరసకు చెల్లి అయ్యే యువతిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే.. అందుకు పెద్దలు అంగీకరించలేదు. అది తప్పు అంటూ.. పెద్దలు వారిని మందలించారు. అంతే.. తమ ప్రేమను కాదు అన్నారనే కోపంతో.. బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని వెంకటాపురానికి చెందిన గ్రామ వలంటీర్‌ పేరుబోయిన సాయికుమార్‌(20), అదే గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకటస్వామి మైనర్‌ కుమార్తె(15)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏమిటని పెద్దలు మందలించారు. ఈ క్రమంలో ఆ యువజంట శనివారం అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ జంట పొలంలో వేపచెట్టుకు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ పి.నాగరాజు, వీఆర్వో జి.వి.రమణ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.