మూడు జిల్లాల ఎన్నికలు రెండు పార్టీల్లోని నేతల్లో బిపి పెంచేస్తోంది.
మూడు జిల్లాల ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ సమస్యే ఇరు పార్టీల నేతలనూ నిద్ర పోనీకుండా చేస్తోంది. పోలింగ్ జరిగిన కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల తాజా రిపోర్టులను చూస్తుంటే మూడు స్ధానాల్లోనూ ఫలితాన్ని ఊహించటం కాస్త కష్టంగానే ఉన్నది. ఎందుకుంటే, శుక్రవారం సాయంత్రం పోలింగ్ అయిపోగానే నెల్లూరులో వైసీపీ నుండి పెద్ద ఎత్తున టిడిపి అభ్యర్ధికి వాకాటి నారాయణరెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్లే పొద్దు పోయిన తర్వాత టిడిపి నేతలు స్వీట్లు పంచుకుని, టపాకాయలు కూడా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తాను కనీసం 100 ఓట్ల మెజారిటితో గెలుస్తానంటూ వాకాటి చెప్పుకున్నారు.
అయితే, ఈ ఉదయానికి ఓ వార్త సంచలనంగా మారింది. జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు సిఎంకు పోలింగ్ సరళిపై నివేదిక ఇచ్చారట. దాని ప్రకారం నెల్లూరు, ఆత్మకూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో టిడిపి నుండే వైసీపీకి అనుకూలంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందట. దాంతో చంద్రబాబునాయుడు కూడా జిల్లా నేతలతో వెంటనే ఫోన్లో సంప్రదించి వాస్తవాలను ఆరాతీయాలని ఆదేశించారట. ఇక, కడప విషయానికి వస్తే రాయచోటి మినహా మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లోని ఓట్లలో టిడిపి నుండే కొద్దో గొప్పో వైసీపీ అభ్యర్ధికి వైఎస్ వివేకానందరెడ్డికి అనుకూలంగా పడ్డాయని సమాచారం. వ్యక్తిగతంగా వివేకాను అభిమానించే వారున్నందునే టిడిపి నుండి కూడా కొన్ని క్రాస్ ఓటింగ్ జరిగిందనేది సమాచారం.
అదేవిధంగా, కర్నూలులో కూడా జరిగిందట. భూమా నాగిరెడ్డి మద్దతుదారులెవరూ టిడిపి అభ్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డికి ఓట్లు వేయలేదట. భూమా మరణానికి చంద్రబాబే కారణమన్న కోపంతో వారెవరూ శిల్పాకు ఓట్లు వేయలేదని ప్రచారంలో ఉంది. శిల్పాకు ఓట్లు వేయలేదంటున్నారే కానీ పోలింగ్ నుండి గైర్హాజరయ్యారా లేక వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్రెడ్డికి వేసారా అన్న విషయంలో స్పష్టత లేదు. మొత్తం మీద మూడు జిల్లాల ఎన్నికలు రెండు పార్టీల్లోని నేతల్లో బిపి పెంచేస్తోంది.
