కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రజలను బయటకు రానీయకుండా ఆంక్షలను విధిస్తు... జనసమ్మర్థమైన ప్రదేశాలను అన్ని దేశాల ప్రభుత్వాలు మూసివేసి కట్టుదిట్టమైన నివారణ చర్యలను తీసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు. 

భారతదేశంపై కూడా ఈ మహమ్మారి పంజా విసరడం ఆరంభించడంతో భారతప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ ని దేశం నుండి తరిమి కొట్టేందుకు పూనుకున్నాయి

మన పొరుగునున్న మరో తెలుగు రాష్ట్రం  తెలంగాణ లో ఈ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ వైరస్ పై యుద్ధం ప్రకటించారు.  ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. 

Also read: కరోనాతో హైదరాబాద్ లో వ్యక్తి మృతి... అతనికి చికిత్స చేసిన డాక్టర్ కూడా...

మరోవైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైరస్ ప్రభావం ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ... భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉంటాయో మాత్రం చెప్పడం కష్టం. జాగ్రత్త చర్యలను అధికంగా తీసుకోవడం లేదని, స్కూళ్ళను, కాలేజీలను మూసేయకుండా జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ విషయమై ఫైర్ అయ్యారు. జగన్ గారికి తన సొంత కూతుర్ల మీద ఉన్నంత ప్రేమ రాష్ట్ర ప్రజలపై కొరవడిందని ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. 

ఒకదానికొకటి అనుబంధంగా రెండు ట్వీట్లు చేసారు బుద్ధ వెంకన్న. "పేరాసిట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని జగన్ గారు సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?" అని ప్రశ్నించారు. 

ఇక మరో ట్వీట్లో ప్రజల ప్రాణాలంటే జగన్ గారికి పర్లేదా అంటూ ఫైర్ అయ్యారు. జగన్ గారికింత స్వార్థమా అంటూ ప్రశ్నించారు. "అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా పర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్ధమా ?"