ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. 84 కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలోనూ, 82 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై ఆదివారం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read:కరోనాపై తప్పుడు ప్రచారం: ఏపీలో 60 కేసులు నమోదు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులను పంపిణీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. హైరిస్క్ ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయ్యిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు శనివారం రాత్రి వరకు 32,349 మందిని రిఫర్ చేయగా, వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్థారించారు.

Also Read:రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు.. అంతా ఉచితమే: జగన్ ఆదేశాలు

అయితే 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల కోవిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు జగన్‌కు వివరించారు.