అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మొత్తం కేసులు వేయికి చేరువలో ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో 955కు చేరుకుంది. మరణాల సంఖ్య 29కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు.

ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 145 మంది డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 781 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా అనంతపురం జిల్లాలో నాలుగు, తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. గుంట్ూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కూడా కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు ఒక కేసు, ప్రకాశం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. 

విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో తాజాగా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కరోనా వైరస్ తాకలేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. జిల్లా మొత్తం 261 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఎప్పటిలాగే రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జిల్లాలో మొత్తం 206 కేసులు నమోదయ్యాయి. కాగా, కృష్ణా జిల్లాలో తాజాగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 102కు చేరుకుంది.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

అనంతపురం 46
చిత్తూరు 73
తూర్పు గోదావరి 34
గుంటూరు 206
కడప 51
కృష్ణా 102
కర్నూలు 261
నెల్లూరు 68
ప్రకాశం 53
విశాఖపట్నం 22
పశ్చిమ గోదావరి 39