అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ బస్టాండ్‌లో కరోనా సోకిన ఓ మహిళ సొమ్మసిల్లిపడిపోవడం గురువారం నాడు కలకలం రేపింది.బస్టాండ్ ఆవరణలోనే ఆమె రెండు గంటల పాటు ఉండడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.

జిల్లాలోని కన్నెకల్లు మండలం ఎన్. హన్మాపూర్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ  అనారోగ్యంతో గత నెల 21వ తేదీన అనంతపురం ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోసా సోకినట్టుగా ఈ నెల 1వ తేదీన వైద్యులు నిర్ధారించారు. ఇదే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఐసోలేషన్ వార్డు నుండి ఆమె బయటకు వచ్చింది. ఇవాళ ఉదయం ఉరవకొండ బస్టాండ్‌లో సొమ్మసిల్లిపడిపోయింది.

also read:కరోనాతో 21,129 మంది మృతి: ఇండియాలో 7,67,296కి చేరిన కరోనా కేసులు

కరోనా భయంతో ప్రయాణీకులు ఎవరూ కూడ ఆమె వద్దకు వెళ్లలేదు. బస్టాండ్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఈ విషయాన్ని ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఉరవకొండ బస్టాండ్ లో పడిపోయిన ఆ మహిళను వైద్య సిబ్బంది అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఎవరూ కూడ పట్టించుకోకపోవడంతో తప్పించుకొని వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి నుండి వివరాలను సేకరిస్తున్నారు.