గుంటూరు: పాజిటివ్ వ్యక్తులను మాస్క్ పెట్టుకోండి... బయటకు తిరగకండి అని చెప్పినందుకు సచివాలయం ఏఎన్ఎం ఇంటిపై కరోనా రోగులు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

గ్రామంలోని కొందరికి కరోనా సోకడంతో అధికారులు వారిని హోంక్వారంటైన్ లో పెట్టారు. ఈ క్రమంలో గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని కరోనా రోగులను బయట తిరగవద్దని సచివాలయం ఏఎన్ఎం సూచించింది. అలాగే కరోనా సోకినవారి కుటుంబసభ్యులు మాస్కు పెట్టుకోకుండా బయట తిరగవద్దని సూచించారు.

వీడియో

కరోనా వ్యాప్తి చెందకుండా ఏఎన్ఎం చెప్పిన జాగ్రత్తలు ఓ కుటుంబానికి నచ్చలేవు. దీంతో వారు సదరు ఏఎన్ఎంపై కోపంతో ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బండ బూతులు తిడుతూ నీకు కూడా కరోనా అంటిస్తామని చెప్పి ఇంటి మీదకు వచ్చారు. అంతేకాకుండా ఆమెపై కూడా దాడికి ప్రయత్నించారు. 

అయితే ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేస్తున్న మెడికల్ సిబ్బంది మీద దాడి చేయటం అత్యంత నీచమని.... కరోనా వల్ల ప్రాణం పోతుందని తెలిసికూడా విధులు నిర్వర్తిస్తున్న వారిపై దాడులకు పాల్పడటాన్ని గ్రామస్తులు తప్పుబడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్నారు.