అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. తాజాగా సచివాలయంలో పనిచేసే మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయం, అసెంబ్లీలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. 

వరుసగా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఇరిగేషన్ శాఖలో తాజాగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ శాఖలో ఉద్యోగులకు ఈనెల 14 వరకు వర్క్‌ ఫ్రమ్ హోంకు అనుమతిస్తూ అధికారులు మౌళిక ఆదేశాలు జారీ చేశారు.

read more  దేశంలో కరోనా విజృంభణ: ఆరు లక్షలు దాటిన కేసులు, 17 వేలు దాటిన మరణాలు

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రానికి చెందినవారిలో 611 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 39 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  తద్వారా రాష్ట్రంలో  బుధవారం 657 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మృతిచెందారు. 

 కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 193కు చేరుకుంది. రాష్ట్రంలో 28,239 శాంపిల్స్ ను పరీక్షించారు.  24 గంటల్లో 342 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 

ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 9 లక్షల 18 వేల 429 శాంపిల్స్ ను పరీక్షించారు. ప్రస్తుతం కరోనా వైరస్ రోగుల్లో 8071 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న బయటపడ్డ కేసుల్లో 118 కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, తూర్పు గోదావరి జిల్లాలో 80, గుంటూరు జిల్లాలో 77, కడప జిల్లాలో 60, కృష్ణా జిల్లాలో 52, కర్నూలు జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. 

నెల్లూరు జిల్లాలో 33, ప్రకాశం జిల్లాలో 28 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో 21, విజయనగరం జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చివారిలో ఇప్పటి వరకు 2036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 403 కేసులు నమోదయ్యాయి.