జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని బుకాయిస్తున్న జెసి సారి చెప్పటానికి నిరాకరించారు. అంతేకాకుండా వివాదం జాతీయస్ధాయిలో రగులుతుండగానే ప్యారిస్ కు వెళ్ళిపోయారు.

రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఫారెన్ చెక్కేసారు. దేశీయంగా తమ విమానాల్లో ప్రయాణానికి ఎంపిని అనుమతించేది లేదని కొన్ని సంస్ధలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి విశాఖపట్నం విమానాశ్రయంలో మొదలైన వివాదం ఇపుడు జాతీయ స్ధాయిని దాటి అంతర్జాతీయస్ధాయికి చేరుకుంది.

వివాదంలో తమ ఎంపిదే తప్పని కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అంగీకరించారు. కాకపోతే ఘటన జరగ్గానే ఎంపి ఫిర్యాదు చేయటంతో ఎంపిది తప్పులేదని మంత్రి అనుకున్నారు. అందుకే స్వయంగా ఇండిగో విమాన సంస్ధ అధికారులతో మాట్లాడి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. అయితే, తర్వాత సిసిఫుటేజ్ చూసిన కేంద్రమంత్రి ఎంపిదే తప్పని తేల్చారు.

అయితే, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఒకవైపు ఎంపిని రక్షించుకోవాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుండగానే ఇంకోవైపు తన కుటుంబసభ్యులతో శుక్రవారం రాత్రి ప్యారిస్ చెక్కేసారు. ఎంపితో మాట్లాడించి విమాన సిబ్బందికి సారి చెప్పించి వివాదానికి ముగింపు పలకాలని చంద్రబాబు బావించారు. అయితే, జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని బుకాయిస్తున్న జెసి సారి చెప్పటానికి నిరాకరించారు. అంతేకాకుండా వివాదం జాతీయస్ధాయిలో రగులుతుండగానే ప్యారిస్ కు వెళ్ళిపోయారు. జెసిపై అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి ఇంకా ఏ సంస్ధ కూడా నిర్ణయం తీసుకోలేదు. అదే అదునుగా జెసి విదేశాలకు వెళ్ళిపోవటం గమనార్హం.