కోర్టు దిక్కరణ... హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ లపై న్యాయమూర్తి సీరియస్
కోర్టు ఆదేశాలను పాటించకుండా దిక్కరించిన నలుగురు ఐఏఎస్ లు సోమవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో రైతు భరోసా కేంద్రాలు, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయాలను నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే స్కూల్ ఆవరణలో ఇతర భవనాలు నిర్మించవద్దన్న తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని వ్యాఖ్యానించిన ధర్మాసనం సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ధిక్కార కేసు విచారణ సందర్భంగా నలుగురు ఐఏఎస్ లు హైకోర్టుకు హాజరయ్యారు. ఇలా హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లు వున్నారు.
పేద పిల్లలు చదువుకునే స్కూల్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా? అని హైకోర్టు జడ్జి దేవానంద్ సదరు ఐఏఎస్ అధికారులను ప్రశ్నించారు. పాఠశాలల ఆవరణలో ఇతర నిర్మాణాల వద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోకుండా నిర్మాణాలు ఎందుకు కొనసాగిస్తున్నారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలోకి రాజకీయాలు తీసుకెళ్తారా? అని అధికారులపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.
తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమగ్ర నివేదిక ఇస్తామన్న ఏజీ న్యాయస్థానానికి తెలిపారు.
read more జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు
ఇక ఇటీవల కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులను రెగ్యులైజ్ విషయంలో తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం దీనిని కోర్ట్ ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది.
అయితే కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఐఎఎస్ అధికారుల అరెస్ట్ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అయితే తాజాగా మరోసారి గిరిజా శంకర్ తో పాటు మరికొందరు కోర్టు దిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆగస్ట్ 30న తేలనుంది.