జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు జారీచేసింది. విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని దాఖలైన ఆ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసును ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.
సిబిఐ కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిలో విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా భయాందోళనలు కలిగిస్తూ ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. విచారణకు సహకరిస్తామని చెప్పి కూడా ఏడాదిగా కోర్టు విచారణకు హాజరు కావడం లేదని, బెయిలు షరతులను ఉల్లంఘించారని రఘురామ కృష్ణం రాజు తన పిటిషన్ లో ఆరోపించారు.
తనపై నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి కీలకమైన పదవులను ఇచ్చే విధంగా జగన్ ను ప్రభావితం చేశారని, దాంతో సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ ప్రతివాదిగా ఉన్న విజయ సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది.