గుంటూరు: కరోనా మహమ్మారి బారినపడి ఓ పోలీస్ మృతిచెందిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసు స్టేషన్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాడు. అయితే పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవటంతో తెల్లవారు జామున గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

ఇక ఇదే గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్ల శ్రీదేవి కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్ట్ చేయించుకున్న ఆమెకు పాజిటివ్ గా నిర్దారణ కావడంతో వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు. ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కాంటినెంటల్ లోని ఎమర్జెన్సీ విభాగంలో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. 

స్వయంగా డాక్టర్ కూడా అయిన ఉండవల్లి శ్రీదేవి తనకు సోకిన కరోనా విషయంలో అశ్రద్ధ చేశారు. తగిన సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్య తీవ్రమయింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీదేవి ఆరోగ్యం మీద ఏపీ సీఎంవో నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీదేవి అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.