అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైసీపీని ప్రధాన శత్రువుగాను చూడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరణించేవరకు  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.  కానీ, జగన్ ఏర్పాటు చేసిన  వైసీపీని ప్రధాన శత్రువుగానే చూడాల్సిన అవసరం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కల్గించేలా ఇతర పార్టీల నుండి  వచ్చేవారిని ఆహ్వానించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ  నేతలు నిర్ణయం తీసుకొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  ఉమెన్ చాందీ సోమవారం నాడు  విజయవాడలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

ఈ సమావేశంలో ప్రధానంగా వైసీపీపైనే చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో వైసీపీ  ఏ రకంగా  డ్రామాలు ఆడిందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ  నేతలకు  గుర్తు చేశారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు.  చివరిక్షణం వరకు ఆయన పార్టీలోనే ఉన్నారని పార్టీ నేతలు గుర్తుచేసుకొన్నారు. అయితే వైఎస్ఆర్ తనయుడు జగన్ మాత్రం తమకు ప్రధాన శత్రువేనని  కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీని ప్రధాన శత్రువువగా చూడాల్సిన అవసరం ఉందని  కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలు,  ముఖ్య నేతలతో  పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి,  రాష్ట్ర ఇంచార్జి ఉమెన్ చాందీ  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ప్రజలెదుర్కొంటున్న సమస్యలను తీసుకొని  పోరాటం చేయాలని పార్టీ నేతలకు  ఉమెన్ చాందీ సూచించారు. జనసేన పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు పార్టీ నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.  జనసేన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారని సమాచారం.

అయితే  గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం తటస్థంగా ఉన్న నేతలను  తిరిగి పార్టీలోకి  ఆహ్వానించాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే  పార్టీకి ఉపయోగపడేవారిని  ఆహ్వానించాలనే  సూచన కూడ వచ్చిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అంతేకాదు  ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తివాదులను కూడ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని  కూడ  కొందరు పార్టీ నేతలు ఈ సమావేశంలో సూచించారు. ఎన్నికల సమయంలో  టిక్కెట్లు  దక్కని వారు పార్టీలో చేరడం కంటే  ఎన్నికలకు ముందే  పార్టీలో చేరేలా  ప్లాన్ చేయాలనే అభిప్రాయాలు కూడ వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రాష్ట్ర ఇంచార్జి  ఉమెన్ చాందీ  దిశా నిర్ధేశం చేయనున్నారు. ప్రత్యేక హోదాతో పాటు  విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్ తో  ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించనున్నట్టు  కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.