ప్రధాని నరేంద్ర మోదీని పంజాబ్ అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజుపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తున్నా మాట్లాడని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) ఇప్పుడు ప్రధాని మోదీ (narendra modi)ని పంజాబ్ లో అడ్డుకుంటే చాలా ఆవేదనకు గురవుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ (sunkara padmasri) ఎద్దేవా చేసారు. పంజాబ్ లో ప్రధానిని అవమానించారని బాధ పడుతున్న వీర్రాజుకు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన అలుపెరుగని పోరాటంలో 700 మంది బడుగు, బలహీన వర్గాలు రైతులు చనిపోతే బాధ కలగలేదా? అని నిలదీసారు. 

''రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుంటే సోము వీర్రాజుకు ఆవేదన కలగలేదా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ap special status), పోలవరం (polavaram project), విభజన హామీలు, రాజధాని నిర్మాణం (amaravati), రైల్వే జోన్ (railway zone) హామీలు గాలిలో దీపాలుగా మారితే సోము వీర్రాజు గుండె చెరువు అవ్వలేదా? అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చేస్తుంటే బీజేపీ (bjp) నేతలు ఎక్కడ ఉన్నారు?'' అని పద్మశ్రీ ప్రశ్నించారు. 

''కాంగ్రెస్ (congress) కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని సోము వీర్రాజు అనడం దయ్యాలు వేదాలు చదివినట్లుగా ఉంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఎవరు అపహాస్యం చేస్తున్నారో దేశ ప్రజలు చూస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను ధగ్ధం చేయడం బీజేపీ అవకాశవాద రాజకీయాలకు సాక్ష్యం. పంజాబ్ లో ప్రధాని మోదీ పాల్గొనే సభలో జనాలు లేకపోతే పరువు పోతుందనే ఆయనను అడ్డుకున్నట్లు నాటకాలు ఆడారు'' అని ఆరోపించారు. 

''బీజేపీకి ఏమైనా జరిగితే అస్సలు ఆ పార్టీ నేతలు స్పందిస్తారో లేదో తెలియదు కానీ సినీనటి కంగనా రనౌత్ (kangana ranaut) మాత్రం కన్నీరు పెట్టుకుంటారు. సినిమా హీరోయిన్ కదా ఏం మాట్లాడినా మీడియా, ప్రజలు చూస్తారని కంగనా భావిస్తోంది. బీజేపీ నిజ స్వరూపం ఏంటో కంగనాకు తెలుసా? ఒక మహిళగా కంగనాకు చెబుతున్నా... మోదీ ట్రాప్ లో పడి భారతీయులను అవమానించొద్దు'' అని హెచ్చరించారు. 

''ఏపీలో బీజేపీ నేతలను చూస్తుంటే పాపం జాలేస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ కూడా ఉందని చెప్పడానికి బీజేపీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. అందుకోసమే ఏవేవో చేస్తున్నారు. అయినా రాష్ట్రానికి అన్యాయం చేసిన ఈపార్టీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు'' అని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.