Asianet News TeluguAsianet News Telugu

రాజన్న రాజ్యం పేరిట హడావిడి... షర్మిల పై చింతామోహన్

 కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను తన సొంత పథకాలుగా చిత్రీకరించి లబ్ధి పొందారన్నారు. ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించడమే రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు.

Congress Leader Chinta Mohan Fire on Sharmila
Author
Hyderabad, First Published Feb 12, 2021, 2:12 PM IST

కాంగ్రెస్ పార్టీతో పైకొచ్చిన వైఎస్ కుటుంబీకులు ఇప్పుడు రాజన్న రాజ్యం పేరిట హడావిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సినియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ మండిపడ్డారు.  తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న షర్మిలకు తాను సూటిగా కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖర రెడ్డిని రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిందని,  అయితే  ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించి, తన సొంత పలుకుబడిని పెంచుకున్నారని, తన ఇద్దరు బిడ్డలు వేల కోట్లు సంపాదించుకునేలా ఆర్థిక వనరులను సృష్టించారని ఆరోపించారు.

 గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా సొంత ప్రాపకానికి పాల్పడలేదన్నారు.  జేసీ దివాకర్‌ రెడ్డి, ఎంవీ మైసూరా రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను తన సొంత పథకాలుగా చిత్రీకరించి లబ్ధి పొందారన్నారు. ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించడమే రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. జగన్‌ పరిపాలనలో అవినీతి ఆకాశం ఎత్తుకు లేచిందని, ప్రతి ఫైల్‌కూ పైసలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

65 మైన్ల నుంచి  నెలనెలా కోట్ల రూపాయలు, ఇసుక నుంచి వందల కోట్ల రూపాయలు, మద్యం నుంచి ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు దండుకుటున్నారని ఆరోపించారు.  ముఖ్యమంత్రి బలహీనత వల్ల ఆఖరికి టీటీడీ కూడా చేయి జారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంతటి బలహీనమైన ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. టీటీడీని అదుపులోకి తెచ్చుకోవడానికి ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కుట్ర చేస్తున్నాయన్నారు. 

 టీటీడీ ఆధీనంలో ఉన్న రూ.10వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులపై ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కన్నేశాయని ఆరోపించారు.  ఈమేరకు ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షతన రహస్య సమావేశం జరిగిందని,  ప్రధానంగా టీటీడీని తమ చేతుల్లోకి ఎలా తీసుకోవాలన్న దానిపై లీగల్‌ సలహా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటున్నారో అదేవిధంగా టీటీడీని ధారాదత్తం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖండిస్తున్నానని, రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ ఏక కంఠంతో వ్యతిరేకించాలని మోహన్‌ పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios