కడప: కాంగ్రెస్-టీడీపీల కలయికపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును సమర్ధించలేనని అందుకే పార్టీ వీడుతున్నట్లు సి రామచంద్రయ్య స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఏఐసీసీ కనీసం పీసీసీని కూడా సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. కనీసం సీనియర్ లీడర్స్ ను కూడా సంప్రదించకుండా చంద్రబాబుతో పొత్తు ఎలా తేలుస్తారంటూ అధిష్టానాన్ని నిలదీశారు.  

కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు తాము ఇప్పటికీ మరచిపోలేమన్నారు. విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చెయ్యాలని, సోనియాను దేశం నుంచి తరిమెయ్యాలి ఇలా ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ గుంటూరు జిల్లా వస్తే నల్లబ్యాడ్జీలతో టీడీపీ నిరసన ప్రదర్శనలు చేసిన విషయాన్ని తాము ఇంకా మరచిపోలేదన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తాము ఎందుకు సమర్థించాలని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. 

చంద్రబాబునాయుడుకు ఓ సిద్ధాంతం అనేది లేదని మండిపడ్డారు. అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాపాలను తాము భుజాన వేసుకునే ఖర్మ పట్టలేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలతో దొరికిన వ్యక్తితో పొత్తా అంటూ ప్రశ్నించారు. ఓ కార్యకర్తగా టీడీపీ కాంగ్రెస్ పొత్తును ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబుతో రాహుల్ దోస్తీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు మరో నేత గుడ్ బై