తిరుపతి సభకు జనం తోలలేక మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారు

Congress former minister Ramachandraiah says babus tirupati meeting is a drama
Highlights

‘‘తిరుపతి సభకు జనం తోలలేక మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారు‘‘ 

( జింకా నాగరాజు)
ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు యు-టర్న్ బాబు అని , మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మాజీ మంత్రి,  కాంగ్రెస్ నేత రామచంద్రయ్య  విమర్శించారు. ఆయన లోగుట్టు తెలిసినందునే చంద్రబాబు దీక్షకు  మొన్న ప్రజలెవరూ రాలేదు, తిరుపతి సభకు వస్తారన్న నమ్మకం లేదని అన్నారు.
ఇపుడు కూడా ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా హోదా కోసం పోరాటం చేయడం లేదని, ఏదో మభ్యపెట్టేందుకు దీక్షలు,సభలు, సమావేశాలు చేస్తున్నాడని ఆయన హెచ్చరించారు.చిత్తశుద్ధి లేకుండా కూర్చున్నందునే చంద్రబాబు విజయవాడ దీక్ష అట్టర్ ఫ్లాప్ అని ఆయన అన్నారు. ఇపుడు మరొక డ్రామా కోసం ఈ నెల 30 న తిరుపతి సభ పెడుతున్నారని, దీనికి  జనాలను తరలించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సంతృప్తి కరంగా జనాలను  తరలించేందుకు  మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారని రామచంద్రయ్య తెలిపారు.   శుక్రవారం నాడు విజయవాడు నుంచి రామచంద్రయ్య ఏషియానెట్ తో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కుటుంబం ఇంకా తెలంగాణలో ఉండటానిక ఆయన ఆక్షేపణ తెలిపారు.  ‘‘సాధారణంగా  ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే వారి కుటుంబం అక్కడ ఉండాలి. కానీ బాబు విషయంలో అలా లేదు. ఆయనేమో ఆంధ్రాకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబమేమో ఇంకా తెలంగాణలో ఉంటుంది. ఇదేమిటి? ఉద్యోగులనేమో ఉన్నఫలానా రాత్రికి రాత్రి రాజధానికి రావాలని చెప్పావు. రాని వాళ్ల దేశ్రదోహులనే విధంగా ప్రచారం చేశారు. నువ్వేం చేస్తున్నావ్,’ అని ఆయన  ఏషియానెట్ కు చెప్పారు.
ముఖ్యమంత్రి ని యు-టర్న్ బాబు అని చెబుతూ హోదా గురించి ఆయన ఎన్నిసార్లు కుప్పిగంతులు వేశారు రామచంద్రయ్య చెప్పారు. ‘ అసలు ఆయన మనసులో హోదా డిమాండ్ లేదు. ఎపికి హోదా వద్దు. హోదా ఏమన్నా సంజీవనా అని ఎగతాళి చేశాడు. అంతేకాదు, ఏపీకి హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని బీజేపీ కి చెప్పింది చంద్రబాబే. అందుకే పాకేజి ఉత్తుతి ప్రకటన రాగానే సన్మానాలు చేయించుకున్నాడు. ఇపుడు రాష్ట్ర ప్రజలంతా హోదా అనగానే హోదా  గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని సార్లు మాట  మార్చడం ప్రజలు గమనించారు,’ అని ఆయన అన్నారు.
30న తిరుపతి లో టీడీపీ సభ ఉద్దేశ్యం ఏమిటో చెబుతూ, బీజేపీకి హామీలు గుర్తు చేసేందుకే సభ అని ముఖ్యమంత్రి చెప్పడం విడ్దూరంగా ఉందని ఆయన అన్నారు.
బాబు హోదా సాధించాలని ప్రజలు కోరుతున్నారు, రాష్ట్ర్ ప్రజలు టీడీపీ కార్యకర్తలు కాదని బాబు తెలుసుకోవాలి. ‘‘బాబు రోజుకో మాట తో యూ టర్న్ రాజకీయాలు చేయాలనుకోవడం, దాని కప్పిపుచ్చుకునేందుకు సభలు దీక్షలంటూ  ప్రచారంచేయడం చేస్తున్నాడని అన్నారు. యూ టర్న్ తీసుకుని ప్రజలను మభ్య పెట్టినందుకు బాబు క్షమాపణ చెప్పి ప్రజల్లోకి వెళితేనే మద్దతు ఉంటుంది,’ అని రామచంద్రయ్య అన్నారు. 
గవర్నర్  ఇఎస్ ఎల్  నరసింహన్ మీద ఉన్నట్లుండి ఉరుము ఉరిమినట్లు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల రామచంద్రయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్ తో ప్రయోజనం తీరిపోయినందునే ఇపుడు దాడికి పూనుకుంటున్నాడని ఆయన ఆరోపించాను.
‘‘గవర్నర్ రాష్ట్ర విభజనకు పని చేస్తున్నాడని కాంగ్రెస్ మొదట్లో చెప్పింది. అయినా గవర్నర్ తో ఆయన సఖ్యంగా ఉన్నాడు. ఏదో ప్రయోజనం ఆశించే ఇలా చేశాడు.  ఇపుడు ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు.అందుకే  గవర్నర్ మీద విమర్శలు చేస్తున్నాడు,’ అని అన్నారు. 
ముఖ్యమంత్రి కుల పిచ్చి గురించి మాట్లాడుతూ,  ఇటీవల జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణల మీద చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ‘సామాజిక అన్యాయం’ జరుగుతోందని, దీనిని తెలుగుదేశం పార్టీ పెంచిపోషిస్తున్నదని రామచంద్రయ్య విమర్శించారు.

loader