రేపటి ఎన్నికల్లో వైసీపీకో లేక జనసేనకో మూడు పార్టీలూ తోకపార్టీల్లాగ మిగిలిపోతాయామో.
దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీలు ఇపుడు ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. నిజంగా అది ఆ పార్టీలకు ఇబ్బందే. ఒకటేమో స్వయంగా తన గోతి తానే తవ్వుకుంది. మరోటేమో గొయ్యి తవ్వుకున్న పార్టీతో అంటకాగినందుకు గోతిలో పడిపోయింది. ఇంకోటేమో తానింకే బ్రతికే ఉన్నానని చాటుకునేందకు అవస్తలు పడుతోంది. ఇంతకీ ఆ పార్టీలేవన్న విషయం ఈ పాటికే అర్ధమైపోయిందా? అదే నండి కాంగ్రెస్, వామపక్షాల గురించే.
ఎన్టీఆర్ ప్రభంజనంలో 1983లో దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ లేచి నిలబడిన పార్టీ కాంగ్రెస్. తర్వాత వైఎస్ హయాంలో ఉచ్ఛస్ధితికి చేరుకుని వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అటువంటిది రాష్ట్ర విభజన అన్న తప్పుడు నిర్ణయంతో తన గోతిని తానే తీసుకున్నది. విభజన తర్వాత ఆ పార్టీలోని నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోవటంతో పార్టీ ఉనికి కోసం పాకులాడుతోంది.
ఇక, వామపక్షాల్లో సిపిఐది విచిత్రమైన పరస్ధితి. నిజానికి ఆ పార్టీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నంతకాలం బలంగానే ఉంది. ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం రెండు, మూడు వేల ఓట్లుండేది. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన పాపానికి సిపిఐ కూడా గోతిలోనే పడింది. దాంతో ఉనికి కోసం ఇపుడు నానా అవస్తలు పడుతోంది. సిపిఎం పార్టీ పరిస్ధితి కూడా పై రెండు పార్టీలకు భిన్నంగా ఏమీ లేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది. అందుకే ఇపుడు పుంజుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి పై మూడు పార్టీలకు ఇంతటి గడ్డు పరిస్ధితి ఎప్పుడూ ఎదురుకాలేదేమో. రేపటి ఎన్నికల్లో వైసీపీకో లేక జనసేనకో మూడు పార్టీలూ తోకపార్టీల్లాగ మిగిలిపోతాయామే.
