దాదాపు 40 మంది ఎంఎల్ఏలు రెండు క్యాంపుల్లో లేకుండా మాయమైపోయారట. అందుకు కారణాలు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

తమిళనాడు రాజకీయాలు నిముషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు రెండు పీఠంపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో సర్వత్రా అయోమయం నెలకొంది. మెజారిటీ ఎంఎల్ఏల మద్దతు ఎవరికుంది అన్న విషయంలో పూర్తి కన్ప్యూజన్ నెలకొంది. ఎందుకంటే, బుధవారం వరకూ ముఖ్యమంత్రి పీఠం అందుకునే విషయంలో ధీమాతో ఉన్న శశికళ తాజాగా జావగారిపోతోంది. అదే సమయంలో పన్నీర్ వద్ద కూడా ఎంఎల్ఏల సంఖ్య పెరగటం లేదు. అందుకు కారణాలు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

నిన్నటి వరకూ తనకు 130 మంది ఎంఎలఏల మద్దతుందని చెప్పుకున్న చిన్నమ్మ క్యాంపు ఈ రోజు చిన్నబోయింది. తాజా సమాచారం ప్రకారం చిన్నమ్మ క్యాంపులో 70 మందికన్నా ఎంఎల్ఏలు లేరన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం తమ క్యాంపులో ఉన్న ఎంఎల్ఏలు కూడా ఎక్కడ జారి పోతారో అన్న భయంతోనే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అదే సమయంలో పన్నీర్ వద్ద కూడా ఐదుగురు ఎంఎల్ఏలకన్నా కనబడటం లేదు.

ఈ పరిస్ధితుల్లో మిగిలిన ఎంఎల్ఏలు ఏమయ్యారన్నదే సస్పెన్స్ గా మారింది. పార్టీలో మొత్తం 135 మంది శాసనసభ్యులున్నారు. జయ మరణంతో ఒక స్ధానం ఖాళీ. ప్రస్తుతం చిన్నమ్మ క్యాంపులోను, పన్నీర్ వద్ద ఉన్న 75 మంది ఎంఎల్ఏలున్న విషయంలో స్పష్టత ఉంది. మరి మిగిలిన 40 మంది శాసనసభ్యులెక్కడున్నారన్న విషయంలో ఎవరికీ సమాచారం లేదట. వారంతా ఎక్కడికి మాయమైపోయారో ప్రభుత్వ వర్గాలు ఆచూకీ తీస్తున్నాయి. క్యాంపులో ఉన్న 70 మంది ఎంఎల్ఏల్లో చివరి వరకూ మద్దతుగా ఎంతమంది నిలుస్తారనే విషయంలో అయోమయం ఉందట.

ఇరువర్గాలకూ దూరంగా వెళ్లిపోయిన వారిలో శశికళకు మద్దతుగా నిలిచేవారెందరు? పన్నీర్ వైపు మళ్ళే వారెందరన్న విషయంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గవర్నర్ వచ్చి ఎంఎల్ఏలందరితోనూ విడివిడిగా మాట్లాడి సమాచారం సేకరిస్తే గానీ కచ్చితమైన లెక్కలు తేలేట్లు లేవు. అంతవరకూ ఈ కన్ప్యూజన్ తప్పేట్లు లేదు.