జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనుమతిపై సందిగ్దం నెలకొంది. శనివారం ఇదే విషయమై డిజిపిని వైసీపీ నేతలు కలిసినా అనుమతి కోరుతూ ఎటువంటి లేఖా ఇవ్వలేదని సమాచారం. ఎందుకంటే, భేటీ తర్వాత మీడియాతో బొత్సా మాట్లాడుతూ, పాదయాత్రకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అనుమతి కోరుతూ డిజిపి లేఖ ఇచ్చారా అన్న ప్రశ్నకు మాత్రం బొత్సా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో వైసీపీ నేతల్లో అయోమయం నెలకొంది. ఎందుకంటే, పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందే అంటూ డిజిపి మీడియా సమావేశంలో స్పష్టం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఒకవైపేమో అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ పోలీసులు, ఇంకోవైపేమో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వైసీపీ నేతలు ఎవరికి వారు పట్టుదలకు పోతుండటంతో పాదయాత్ర అనుమతిపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. బొత్సా మాట్లాడుతూ, డిజిపి రూట్ మ్యాప్ అందించామని, అవసరమైన భద్రత ఏర్పట్లు చేయాలని కోరామని చెప్పారు. అందుకు డిజిపి కూడా సానుకూలంగా స్పందించినట్లు కూడా బొత్సా చెప్పారు. గతంలో పాదయాత్ర చేసినపుడు చంద్రబాబునాయుడు కూడా పోలీసుల నుండి అనుమతులు తీసుకోలేదన్న విషయాన్ని వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్సా సత్యనారాయణ డిజిపికి గుర్తుచేసారు.