ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ భూ వివాదంలో ఇరుక్కున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులో హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీసుస్టేషన్లో బాధితుడు మంత్రిపై గురువారం ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తన భూమిని తమకు అమ్మేయాలంటూ మంత్రి దేవినేనితో పాటు ఆయన సోదరుడు, అనుచరులు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ, వేధింపులకు గురిచేస్తున్నారంటూ నరేష్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా విలువైన తన భూమికి సంబంధించి మంత్రి తరపునుండి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం. ఇప్పటికే ఈ భూమిపై కోర్టులో కేసుందని బాధితుడు చెప్పారు. కేసును గనుక ఉపసంహరించుకోకపోతే తన ప్రాణానికే హాని తలపెడతామంటూ మంత్రి అనుచరులు బెదిరిస్తున్నట్లు నరేష్ దంపతులు పోలీసులకు చెప్పారు.