వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిలిపేయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి మాలకొండయ్యలకు ఫిర్యాదు అందింది. జి. భార్గవి పేరుతో మంగళవారం ఉదయం పై ఇద్దరికి మోస్ట్ అర్జంట్ అంటూ ఓ ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది. ఇంతకీ పాదయాత్రపై ఎందుకు ఫిర్యాదు చేశారంటే, జగన్ చేస్తున్న పాదయాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందట.

త్వరలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నట్లు ఫిర్యాదుదారు భార్గవి ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో విద్యార్ధులు పాల్గొనకుండా తల్లి, దండ్రులు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చేట్లు చూడాలన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ఆందోళన చేసినపుడు జరిగిన విధ్వంసాన్ని భార్గవి గుర్తు చేశారు.

జగన్ పాదయాత్ర వల్ల సిఐసి, ఐసిఎస్ పరీక్షలు వాయిదా పడినట్లు ఆరోపించారు. పాదయాత్ర వల్ల పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సెక్యురిటీ ఇవ్వలేకపోతున్నట్లు ఉన్నతాధికారులు చెప్పిన విషయాన్ని ఫిర్యాదుదారు గుర్తు చేశారు. హై కోర్టు ఆదేశాల ప్రకారం 22వ తేదీలోగా పై పరీక్షలు నిర్వహించాల్సున్నా ప్రభుత్వం చేతులెత్తేయటం అన్యాయమన్నారు.

ఇక, పాదయాత్రలో పాల్గొన్న అనంతపురంకు చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి మరణించటాన్ని ప్రస్తావించారు. పాదయాత్రలో పాల్గొంటూనే గుండెపోటుతో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి ఘటనలు జరగకూడదంటే తక్షణమే పాదయాత్ర అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పాదయాత్ర వల్ల మానవ హక్కులు కూడా ఉల్లంఘనకు గురవుతున్నట్లు భార్గవి ఆందోళన వ్యక్తం చేశారు. జనాలకు పాదయాత్ర ఇబ్బందులు కలిగిస్తున్న కారణంగా  వెంటనే పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ భార్గవి డిమాండ్ చేశారు.