మచిలీపట్నంలో పేలుళ్లకు ఉగ్ర కుట్ర... పోలీసులు ఏం చేసారంటే..(మాక్ డ్రిల్ వీడియో)
మచిలీపట్నం బస్టాండ్ ను పేల్చేసేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో వెళుతుండగా మైరైన్ పోలీసులు పట్టుకున్నారు. ఇదంతా నిజం కాదు... పోలీసుల మాక్ డ్రిల్ లో భాగమే.

మచిలీపట్నం : ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఆటోను ఆపి ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేయగా అందులో ఆర్డిఎక్స్ లభించింది. అయితే ప్రజలెవ్వరూ భయాందోళనకు గురికాకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
ప్రయాణికుల వద్ద పేలుడు పదార్థాలు లభించడంతో మచిలీపట్నం వాసులు ఆందోళనకు గురయ్యారు. అక్కడ అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఇదంతా నిజం కాదని... పోలీసుల మాక్ డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో ప్రజల్లోకి వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు కలిసి మచిలీపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
వీడియో
విశాఖపట్నంకు చెందిన కోస్ట్ గార్డులు నాంచారయ్య, మోకా లక్ష్మణరావులు సాగర్ కవచ్ లో భాగంగా తీవ్రవాదులుగా మారారు. సముద్ర మార్గంలో తీవ్రవాదులు బాంబులను ఎలా తరలిస్తారో తెలియజేసేందుకు మచిలీపట్నంలో ప్రవేశించారు. తీవ్రవాదులతో పోలీసులు ఎలా వ్యవహరించాలి... ప్రజలు భయాందోళనకు గురికాకుండా పేలుడు పదార్థాలను ఎలా స్వాధీనం చేసుకోవాలో ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలిపారు.
ఇలా మచిలీపట్నం ఆర్టిసి బస్టాండ్ లో పేలుడుపదార్ధాలు పెట్టడానికి వెళుతున్న డమ్మీ ఉగ్రవాదులను పోలీసులు పట్టకున్నారు. ఇదంతా సాగర్ కవాజ్ కార్యక్రమంలో భాగమని మెరైన్ సీఐ శ్యామ్ శేఖర్ మీడియాకు తెలిపారు.