సారాంశం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎల్లో మీడియా, దత్తపుత్రుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎల్లో మీడియా, దత్తపుత్రుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.  అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన వాడిగా ఈ ప్రాజెక్టును యుద్దప్రతిపాదికన  చేపట్టడం జరిగిందని తెలిపారు. 

గత ప్రభుత్వం ప్రాజెక్టు  కోసం భూమి సేకరించలేదు కానీ.. టెంకాయ కొట్టేందుకు  8 ఎకరాలు  కొన్నదని అన్నారు. గతంలో చెరువులను నింపాలనే ఆలోచన చేయలేదని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు, టెంకాయలు గుర్తుకు వస్తాయని, ఒక జీవో కాపీ గుర్తుకు వస్తుందే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ జరగలేదని చెప్పారు.

తన పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానని.. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు హంద్రీనీవా మీద రూ. 13 కోట్లు ఖర్చు చేశారని.. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 6 వేల కోట్లతో హంద్రీనీవా కాలువ తీసుకొచ్చారని చెప్పారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఈ ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించాలని కోరారు. గతానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని అన్నారు. గత నాలుగేళ్లలో 2.35 లక్షల కోట్లను అక్కాచెల్లెమ్మల ఖాతాలను నేరుగా పంపించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అదే బడ్జెట్, అదే రాష్ట్రం, అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే తక్కువేనని అన్నారు. మరి అప్పటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 

చంద్రబాబు ప్రజలను నమ్ముకోలేదని.. ఆయన నమ్ముకుంది  ఎల్లో మీడియా, దత్తపుత్రుడు మీదేనని విమర్శించారు. దోచుకోవడం.. దోచుకుంది వారితో పంచుకోవడమే చంద్రబాబు చేశారని ఆరోపించారు. అందుకే ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ప్రశ్నించడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పరిపాలన మారిందని చెప్పారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా.. అర్హత ఉంటే చాలు లబ్ది చేకూరుస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో స్కూళ్లలో తేడాలను గమనించాలని కోరారు. ఈరోజు స్కూళ్లు ఇంగ్లీష్ మీడియంగా మారాయని అన్నారు. గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలా అన్ని విధాలుగా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.  

వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం, గవర్ననెన్స్, మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్న, చివరకు సామాజిక న్యాయం తీసుకున్నా.. తమ ప్రభుత్వానికి సాటి ఎవరూ లేరని చెప్పడానికి సంతోష పడుతున్నట్టుగా చెప్పారు. అబద్దాలు, మోసాలు నమ్మవద్దని కోరారు. రానున్న రోజుల్లో అబద్దాలు, మోసాలు ఇంకా పెరుగుతాయని అన్నారు. ‘‘మనకు టీవీలు లేవు, పేపర్లు లేవు.. మనకు ఎల్లో మీడియా లేదు, దత్తపుత్రుడు లేడు. నేను వాళ్లను నమ్ముకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచినే నమ్ముకున్నాను..మీకు మంచి జరిగితేనే మీ బిడ్డకు తోడుగా నిలవండి’’ అని జగన్ పేర్కొన్నారు.