పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ ల పోరు తారా స్థాయికి చేరుకుంది. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోసాని మండిపడిన సంగతి తెలిసిందే.  పృథ్వీ లాంటి వాళ్ల వల్లే జగన్ ప్రతిష్ట దిగజారిపోతోందంటూ పోసాని వ్యాఖ్యానించారు.

పోసాని కామెంట్స్ కి పృథ్వీ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు.  పోసానికి బుద్దిలేదంటూ, కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు. కాగా... ఈ వివాదంలో వైసీపీ అధిష్టానం పృథ్వీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడొద్దని  జగన్ ఆదేశించారు.  పృథ్వీని పిలిచి వ్యక్తిగతంగా జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

AlsoRead పోసానికి బుద్ధి లేదు... ఆ దమ్ము ఉందా..? కౌంటర్ ఇచ్చిన పృథ్వీ...

కాగా..  రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై పోసాని కాస్త ఘాటుగానే స్పందించాడు.  రాజధాని రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం ఘోరమన్నారు. 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని పోసాని ప్రశ్నించారు. రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఐదేళ్ల ప్రభుత్వాన్ని 6 నెలలు కాకుండానే భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను అన్‌పాపులర్‌ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే.. అది పృథ్వీలాంటి వాళ్ల వల్లేనని చెప్పారు.తప్పు  చేస్తే జగనైనా తాను వదలనని పోసాని పేర్కోనడం గమనార్హం.

 పృథ్వీ ఎవరి తరపున మాట్లాడారో చెప్పాలని పోసాని నిలదీశారు. పృథ్వీ వ్యాఖ్యలను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడనని, తన దారి తాను చూసుకుంటానని పేర్కొన్నారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్లలో వచ్చి చేరారని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకొచ్చారు.

రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని మరోసారి ప్రశ్నించారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత ఆవేదన ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్‌ అంటే ద్వేషమని పోసాని కృష్ణ మురళి దుయ్యబట్టారు.

దీనిపై పృథ్వీ మరింత ఘాటుగా స్పందించారు.  తాను ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతులంటే తనకు గౌరవం ఉందని.. వారిని తాను అవమాన పరచలేదని చెప్పారు. కొంత మంది బినామీలు, పెయిడ్ ఆర్టిస్టలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి  పేర్కొన్నారు.

అమరావతిలో రైతుల భూముల్ని తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు మాట్లాడలేదని పృథ్వీ ప్రశ్నించారు. ఆయనకు అమరావతిలో బినామీ రైతులు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తన తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

పోసానికి బుద్ధి లేదని పృథ్వీ పేర్కొనడం గమనార్హం. రాజధాని రైతులపై రోజా, బొత్స లాంటి వాళ్లు కూడా కామెంట్స్ చేస్తున్నారని.. వారిని అనే దమ్ము పోసానికి ఉందా అంటూ ప్రశ్నించారు. తాను కేవలం బినామీలను మాత్రమే అన్నానని చెప్పడం విశేషం. పోసాని స్క్రిప్ట్ రాసుకొని చెప్పాడని పృథ్వీ ఆరోపించారు. తాను వైసీపీ కోసం 11 సంవత్సరాలుగా క్రీయాశీలకంగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు