తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని వ్యక్తి ఒక నాయకుడు.. ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాస్ నిండని వ్యక్తి మరొక నాయకుడు అని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని వ్యక్తి ఒక నాయకుడు.. ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాస్ నిండని వ్యక్తి మరొక నాయకుడు అని విమర్శించారు. ఇంటింటికి వెళ్లి తమ మాదిరిగా.. మంచి చేశామని, దానిని చూసి ఓటు వేయమని అడిగే సత్తా వారికి లేదని విమర్శలు గుప్పించారు. చిత్తూరు డెయిరీ దగ్గర అమూల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సేషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
చిత్తూరుకు చంద్రబాబు ఏం మంచి చేశాడని అడిగితే.. ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి అని విమర్శించారు. చిత్తూరుకు వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా.. చంద్రబాబు నాయుడు గజదొంగల ముఠాలోని ఈనాడు రామోజీరావు వియ్యంకుడు అడ్డుకున్నారని ఆరోపించారు. అడ్డంకులు దాటి వెల్లూరు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి పునాది రాయి వేయనున్నట్టుగా చెప్పారు.
చంద్రగిరిలో గెలవమని చంద్రబాబు కుప్పంకు వెళ్లిపోయాడని.. ఇప్పుడు కుప్పం ప్రజలు కూడా బాయ్ బాయ్ బాబు అంటున్నారని అన్నారు. 75 ఏళ్ల వయసున్నముసలాయన.. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కుప్పంలో ఇళ్లు కట్టుకుంటున్నానని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అనుమతులు ఇవ్వడం లేదని తమపై కూడా నిందలు వేస్తున్నారని మండిపడ్దారు. చంద్రబాబు చిత్తశుద్ది లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏం జరిగిందనేదే.. ఆయన భజన పార్టీలు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
చంద్రబాబు 9 ఏళ్ల హయాంలో 54 ప్రభుత్వ సంస్థలు, సహకార రంగ సంస్థలను మూసివేయడం గానీ, అమ్మేయడం గానీ జరిగిందని ఆరోపించారు. పప్పు బెల్లాలలకే అన్నీ తన వారికే కట్టబెట్టారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను ఎవరికి కట్టబెట్టాలనే సచివాయంలో అమలు చేశారని ఆరోపించారు. 2004లో చంద్రబాబు పోకుంటే.. ఆర్టీసీ కూడా ఉండేది కాదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు హోల్‌సెల్‌గా అమ్మేశారని విమర్శించారు. ప్రైవెటేజైషన్ అనేది ఒక సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు బుక్ కూడా విడుదల చేశారని ఎద్దేవా చేశారు. తాను ఎన్ని మోసాలు చేసినా ప్రజలు మర్చిపోతారనేది చంద్రబాబు నమ్మకం అని విమర్శించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాననేది ఇప్పటీ తరానికి తెలియదనేది చంద్రబాబు నమ్మకం అని అన్నారు.
దత్తపుత్రుడిని ఎప్పుడూ, ఏ ఎన్నికల్లో, ఏ విధంగా జనం మీదకు వదులుతాడనేది జనాలకు తెలియదని చంద్రబాబు నమ్మకం అని విమర్శించారు. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని వ్యక్తి ఒక నాయకుడు.. ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాస్ నిండని వ్యక్తి మరొక నాయకుడు అని విమర్శించారు. ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజ్ సూర్యుడని విమర్శలు చేశారు.
వీళిద్దరికి మన పేదల బ్రతుకుల కూడా తెలియదని అన్నారు. 2014-2019 కాలంలో ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏలారని.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు, దొంగల ముఠాకు డీబీటీ చేయడం లేదని.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలుసునని విమర్శలు చేశారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు నాన్ రెసిడెంట్ నాయకులేనని.. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉంటారని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం తెస్తామంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తామంటే, ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గులతో, అన్యాయస్తులతో యుద్దం చేస్తున్నామని అన్నారు.
దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి వాళ్లకు అధికారం కావాలని.. తాను మాత్రం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికి ఉండటానికే అధికారం కోసం
తాపత్రయపడుతున్నానని చెప్పారు. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్దం జరుగుతుందని చెప్పారు. వాళ్ల మాదిరిగా అబద్దాలు చెప్పలేను, మోసాలు చేయలేనని అన్నారు. తనకు ఎవరితో పొత్తులు లేవని స్పష్టం చేశారు. తాను నమ్ముకున్నది దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో తోడేళ్లు అన్ని ఏకం అవుతాయని.. ఇంకా అబద్దాలు చేస్తారని, అన్యాయాలు చేస్తారని విమర్శించారు. అబద్దాలను నమ్మకుండా.. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవాలని కోరారు.
