ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. మర్కాపురంలో నిర్వహించిన కార్యక్రమాంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ తదితర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 658.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
అయితే లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసేందుకు ల్యాప్ ట్యాప్‌లో బటన్ నొక్కుతున్న సమయంలో సీఎం జగన్.. తనకు సమీపంలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని చేతిని పట్టుకుని ఆయన చేత బటన్ నొక్కించారు. అలాగే మహిళకు చెక్కు అందజేస్తున్న సమయంలో కూడా బాలినేని చేయి పట్టి తన దగ్గరకు లాగారు. ఆ సమయంలో బాలినేని ముఖంలో నవ్వు కనిపించింది.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ వేదికపై బాలినేనికి తాను ప్రాధాన్యత ఇస్తున్నామనే అంశాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది.
