విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు... సీఎం జగన్ రాకతో రోడ్డునపడ్డ ఐటీ ఉద్యోగులు (వీడియో)
విశాఖపట్నంలో జరుగుతున్న ఐసిడిసి సదస్సు ఐటీ ఉద్యోగులకు అగచాట్లు తెచ్చిపెట్టింది. సీఎం జగన్, కేంద్ర మంత్రి, మంత్రులు, విదేశీ ప్రతినిధుల రాక సందర్భంగా పోలీసులు కట్టిదిట్టమైన భద్రత చర్యలు చేపట్టడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు.

విశాఖపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖపట్నం వేదికగా ఐసిఐడి కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహిస్తోంది. ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్రపింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి 25వ ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ ఆండ్ డ్రెనేజ్ సదస్సును ప్రారంభించారు. ఏపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, విడదల రజనితో పాటు 90 దేశాలకు చెందిన 1200 మంది అంబాసిడర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ సదస్సలో పాల్గొన్నారు.
విశాఖలో ఎనిమిది రోజులపాటు ఈ ఐసిఐడి కాంగ్రెస్ ప్లీనరీ జరగనుంది. 57 ఏళ్ల తర్వాత ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఈ సదస్సు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సాగునీరు, వ్యవసాయ అభివృద్దిపై ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించనున్నారు.
ఐసిఐడి సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖ రాడిసన్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు నిర్వహకులు సాదరంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసారు.
వీడియో
అయితే ఈ అంతర్జాతీయ సదస్సుకోసం సీఎం జగన్ తో పాటు కేంద్ర మంత్రి, విదేశీ ప్రతినిధులు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం మొత్తాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రుషికొండ ఐటి సెజ్ వద్ద ఉద్యోగులను కూడా ఆపేసారు. దీంతో చాలాసేపటి వరకు ఉద్యోగులు రోడ్డుపైనే అగచాట్లు పడ్డారు. టైమ్ అవుతుంది ఆఫీస్ కు వెళ్లాలి... విడిచిపెట్టమన్నా పోలీసులు వినిపించుకోలేదని... తమను రోడ్డుపైనే నిలబెట్టారని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు.