Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో తండ్రి వైఎస్సార్ రికార్డునే బద్దలుగొట్టిన జగన్: మంత్రి పుష్ఫ శ్రీవాణి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే రెండు అడుగులు ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.

cm ys jagan breaks his father ysr record: minister pushpa srivani
Author
Amaravathi, First Published Oct 1, 2020, 1:18 PM IST

అమరావతి: ప్రజా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే రెండు అడుగులు ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. పోడు భూములను సాగు చేసుకొనే గిరిజన రైతులకు యాజమాన్య హక్కులను కల్పించే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (ఆర్వోఎఫ్ఆర్) పథకంలో భాగంగా భూమి పట్టాలను పంపిణీ చేయడంలో తన తండ్రి రికార్డును అధిగమించనున్నారని అన్నారు. గతంలో వైయస్సార్ 56 వేల మంది గిరిజనులకు 1.30 లక్షల ఎకరాలు వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేయగా, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాదిలోనే ఏకంగా ఒక లక్షా 11 వేల మంది గిరిజనులకు 2 లక్షల 203 ఎకరాల భూమి వ్యక్తిగత పట్టాలను గాంధీ జయంతి సందర్భంగా అందించనున్నారని తెలిపారు. 

పదేళ్లలో ఇచ్చింది లక్ష 3 వేల ఎకరాలే:

''ఎక్కడో మారుమూల కొండ కోనల్లో బతికే ఆదివాసీ గిరిజనులకు వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై ఎలాంటి హక్కులేదని, వారి పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటూ వారిపై  పలురకాలైన కేసులు పెట్టాయి గత ప్రభుత్వాలు. ఇలా చేసుకుంటున్న భూముల నుండి నిర్ధాక్షిణ్యంగా తరిమికొడుతున్న నేపథ్యంలో ఏ అండా దండాలేని ఆ అమాయక గిరజనులకు మొట్టమొదటిసారి అండగా నిలిచి అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారంగా గిరిజనులకు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కు కల్పించే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 2008లో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ప్రారంభించారు. అప్పట్లో ఆయన 56 వేల గిరిజన కుటుంబాలకు 1.30 లక్షల ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేసారు'' అని గుర్తుచేశారు. 

''అయితే 2008 నుంచి 2019 దాకా ఆర్ఓఎఫ్ఆర్ పథకంలో మొత్తం 95,896 మంది గిరిజనులు వ్యక్తిగత భూమి పట్టాలను పొందగా వాటిలో 56,850 మంది గిరిజనులు వైయస్సార్ హయాంలోనే పట్టాలను అందుకున్నారు. ఆయన తర్వాత గడచిన పదేళ్ల కాలంలో 40,383 మంది గిరిజనులకు మాత్రమే వ్యక్తిగత భూమి పట్టాలు లభించాయి. అలాగే 2008 నుంచి 2019 దాకా గడిచిన పదేళ్ల కాలంలో గిరిజనులు వ్యక్తిగత పట్టాలుగా అందుకున్న భూమి మొత్తం 2,33,961 ఎకరాలు కాగా అందులో 1,30,679 ఎకరాలు కూడా వైయస్సార్ ఇచ్చిన భూములే కావడం, ఆయన తర్వాత గిరిజనులకు పట్టాలుగా లభించింది కేవలం 1లక్షా 3 వేల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం'' అన్నారు. 

''ఈ పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆర్ఓఎఫ్ఆర్ పథకంలో మరింత ఎక్కువ మంది గిరిజనులకు వ్యక్తిగత, సామూహిక  భూమి పట్టాలను అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 1 లక్షా 11 వేల మంది గిరిజనులకు 2 లక్షలా 203 ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేయనున్నారు. ఇంత భారీ స్థాయిలో గిరిజనులకు వ్యక్తిగత భూమి పట్టాలను మంజూరు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం'' అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

అటవీయేతర భూములకు డీకేటీ పట్టాలు:

ఇంతవరకూ కూడా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు షెడ్యూల్ ఏరియాలో అటవీశాఖకు చెందని రెవెన్యూ భూములైతే ఆ భూముల హక్కు పత్రాల కోసం గిరిజనులు పెట్టుకుంటున్న అర్జీలను తిరస్కరించడం జరిగేదని తెలిపారు. అయితే ఈసారి నుంచి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు ఒకవేళ అటవీ శాఖకు చెందని భూములైన పక్షంలో వారు సాగు చేసుకుంటున్న భూములకు డీకేటీ పట్టాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో రాష్ట్ర చరిత్రలో  తొలిసారిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీయేతర భూములకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతోందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో బాగంగానే ఈరోజున 19,919 గిరిజన కుటుంబాలకు 31155 ఎకరాల ప్రభుత్వ భూమిని డికేటీ పట్టాలుగా ప్రభుత్వం గిరిజనులకు అందిస్తోందని వెల్లడించారు.
 

ఒక్కో కుటుంబానికి 2 ఎకరాలకు తగ్గకుండా:

అయితే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూమి పట్టాలను అందించడం ఒక నామమాత్రపు కార్యక్రమం కాకూడదన్నది ముఖ్యమంత్రి అభిప్రాయమన్నారు. ఒక చిన్న కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి బతకాలంటే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలని,  అంతకంటే తక్కువ భూమి ఉంటే దానిపై వచ్చే ఆదాయం వారి జీవనావసరాలకు సరిపోయే అవకాశం లేదన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమని పుష్ప శ్రీవాణి చెప్పారు.  

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒక్కో గిరిజన కుటుంబానికి ఇచ్చే భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదివరకే 2 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన కుటుంబాలకు వారి భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా అదనంగా భూమి పట్టాలను  ఇవ్వడం జరుగుతోందన్నారు. గిరిజనులు తాము పట్టాలుగా పొందిన భూముల ద్వారా ఉపాధిని పొందడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉండే భూముల్లో పంటలు పండించుకోవటానికి అవసరమైన నీటి వసతిని కల్పించుకోవడానికి, వాణిజ్య పంటలను, తోటలను పెంచుకోడానికి కావల్సిన అర్ధిక సహాయాన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్, రూరల్ డెవలప్ మెంట్ శాఖలకు చెందిన వివిధ పధకాల ద్వారా అందించాలని కూడా మార్గదర్శకాలను  జారీ చేయడం జరిగిందని వివరించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios