తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారా?

కడప: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారా? అవునని అంటున్నారు సొంత పార్టీ నేత వరదరాజులు రెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ వరదరాజులు రెడ్డి శనివారం మీడియా సమావేశంలో సిఎం రమేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

 వైసీపీకి సీఎం రమేష్‌ మద్దతుదారుడని వరదరాజులురెడ్డి ఆరోపణలు చేశారు. జగన్‌తో సీఎం రమేష్‌ నిత్యం టచ్‌లో ఉంటున్నారన్నారని విమర్శించారు. వైసిపితో టచ్ లో ఉండి టీడీపిని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో గ్రూపులను పెంచి పోషిస్తున్నారని అన్నారు.

టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోయేలా సర్వనాశనం చేస్తున్నారన్నారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదుశాతం మామూళ్లు ఇవ్వాలని సీఎం రమేష్‌ డిమాండ్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సిఎం రమేష్ దొంగ ఆస్తులను తనఖా పెట్టి వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నారని వరదరాజులు రెడ్డి ఆరోపించారు.