ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అయితే రెండు వారాల వ్యవధిలోనే సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న సీఎం జగన్.. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ వేర్వేరుగా సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే.. సీఎం జగన్ సోమవారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీన్, సీఎం జగన్‌ల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఇద్దరు మంత్రుల స్థానంలో కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కూడా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

ఇక, సీఎం జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విశాఖకు చేరుకోనున్న జగన్.. అక్కడ జరగుతున్న జీ-20 సన్నాహక సదస్సుకు హాజరుకానున్నారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు జీ 20 సన్నాహక సదస్సుకు వచ్చే 20 దేశాల ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అనంతరం విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. అనంతరం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.