ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింత అభివృద్దిని సాధిస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండో రోజు కార్యక్రమాలలో సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 నూతన పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సభ వేదికపై నుంచి సీఎం జగన్ ప్రసంగిస్తూ.. గత మూడున్నరేళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని తెలిపారు. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు.
కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయని తెలిపారు. కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించామని చెప్పారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సమ్మిట్‌లో 15 రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు. వంద మందికి పైగా స్పీకర్స్ పాల్గొన్నారని చెప్పారు. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయని చెప్పారు. మొత్తంగా రాష్ట్రానికి 13 లక్షల 5 వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడితో.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు లభించేలా ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం చిత్తశుద్దితో అడుగులు వేస్తుందని చెప్పారు. పలు రంగాల్లో నాణ్యమైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తున్నట్టుగా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఎంవోయూలు కార్యరూపం దాల్చేటట్టుగా చూస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.
