అమరావతి: సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు  ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఇలా గవర్నర్ ఆమోదం లభించిన  పాలనా యంత్రాగాన్ని అమరావతి నుండి విశాఖకు తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరో 14రోజుల్లో సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఆగస్టు 15వ తేదీలోపు విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించి... 15వ తేదీన పూజ నిర్వహించాలని భావిస్తున్నారట. ఆ మేరకు తరలింపుకు సబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపుతోనే పరిపాలనా రాజధాని తరలింపు ప్రారంభమవ్వాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి విశాఖ నుంచే పాలనా వ్యవహారాలు చూసుకోన్నారట.

read more  మూడు రాజధానులు: చంద్రబాబును కార్నర్ చేస్తున్న బిజెపి నేతలు

అలాగే అమరావతిలోని మిగతా ప్రధాన కార్యాలయాల తరలింపుపై హెచ్.ఓ.డి.లకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పటికే మానసికంగా సిద్దం అయిన ప్రధాన కార్యాలయాలాల ఉద్యోగులు సైతం విశాఖకు తరలేందుకు సంసిద్దంగా వున్నారు. సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయిలో విశాఖ నుంచే పరిపాలన సాగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశలవారీగా ప్రధాన కార్యాలయాల తరలించనున్నట్లు తెలుస్తోంది.

వైసిపి అధికారంలోకి వచ్చి తర్వాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ  విషయాన్ని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ ప్రకటించారు.ఈ రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఏడాది జూన్ మాసంలో శాసనమండలి వాయిదా పడింది. జూన్ కంటే ముందు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని సూచించింది. అయితే సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ  టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేశారు. 

మూడు రాజధానుల ప్రతిపాదనను  టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఈ రెండు బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే అదే సమయంలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని కోరిన విషయం తెలిసిందే.జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది. 

శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు.