Asianet News TeluguAsianet News Telugu

జగన్ వల్ల రాష్ట్రానికి రూ.1.29లక్షల కోట్ల నష్టం: డిటెయిల్డ్‌గా వివరించిన చంద్రబాబు

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)ను 55 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ.2,029 కోట్లు, కృష్ణపట్నంను 44 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ.2,035 కోట్లు అదనంగా ఖర్చు అవుతోంది. రూ.3,800 కోట్లతో 17వేల మెగా యూనిట్లు కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.12,816 కోట్లు అదనపు భారం పడింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల కారణంగా అదనంగా రూ.12,250 కోట్లు భారం పడింది.

CM Chandrababu released a white paper on energy sector GVR
Author
First Published Jul 9, 2024, 7:53 PM IST

అమరావతి: గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,29,503 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్తకొత్త పేర్లతో వడ్డించిన ఛార్జీలతో రూ.32,166 కోట్ల భారాన్ని మోపి ప్రజల నడ్డి విరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేసిన తప్పిదాలు తవ్వేకొద్దీ భయంకరంగా బయటపడుతున్నాయన్నారు. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘గత ఐదేఏళ్లు ఏం జరిగింది.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మళ్లీ సమిష్టిగా ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచారు... ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. సముద్రంలోకి దిగితే కానీ లోతు ఎంతుందో తెలుస్తుందన్నట్లుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నాయి. మాపై నమ్మకంతో గెలిపించిన ప్రజల్లో విశ్వాసం నింపుతాం. వ్యవస్థను గాడిలో పెట్టి, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరిపుష్టి చేయాలో చర్యలు ప్రారంభించాం. అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నాం. సమర్థవంతమైన పాలనతో మెరుగైన ఫలితాలు పేదలకు అందుతాయి. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ప్రజల భవిష్యత్తుతో ఏవిధంగా ఆడుకున్నారో, పిల్లల భవిష్యత్తును ఎలా దెబ్బతీశారో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. సామాన్యుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

విద్యుత్‌తోనే అందరి జీవితం...

‘‘విద్యుత్‌తోనే అందరి జీవితం ముడిపడి ఉంది. ఎంత సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే అన్ని లాభాలు ఉంటాయి. 1995-2004లో 1.0 సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో ఎవరూ తీసుకురావడానికి సాహసం చేయలేనప్పుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. ఒడిశా తెచ్చి కూడా వెనక్కిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చాక 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. దీంతో 2.0 సంస్కరణలు తెచ్చాం. 2019-24లో మధ్య ఉన్న ప్రభుత్వం టారిఫ్ భారం పెంచింది. అప్పులు కూడా రూ.1,29,503 కోట్లు తెచ్చారు. గత ప్రభుత్వ చేతకానితనం, అహంకారంతో విర్రవీగిన వ్యక్తి వల్లే అంత నష్టం వాటిల్లింది. దీనిపై రాగధ్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మిగులు సాధించాం...

‘‘1998లో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలోనే మొదటి ఈఆర్సీని తీసుకొచ్చాం. వీటి ఫలితంగా జనరేషన్, ట్రాన్స్ మిషన్, పంపిణీ సంస్థలు వచ్చాయి. జాతీయ స్థాయిలో సగటున 7.1 శాతం మిగులు విద్యుత్ సాధించాం. 2003-04 మధ్య మిగులు విద్యుత్ సాధించాం. 2004లో నా పవర్ పోయినా.. నేను తెచ్చిన సంస్కరణల వల్ల దేశం బాగుపడింది. 2004లో నన్ను అప్రతిష్టపాలు చేయడం వల్లే అధికారం కోల్పోయాం. ట్రాన్స్ మిషన్ నష్టాలు ఒకప్పుడు 35 శాతం చూపించేవారు. తర్వాత నేను వచ్చాక ఆడిటింగ్ పెట్టడంతో 28 శాతానికి తగ్గించడంతో పాటు చివరకు 7 శాతానికి తీసుకొచ్చాం. 2014లో అధికారం చేపట్టాక 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉన్నా పవర్ మేనేజ్మెంట్ చేశాం. 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్ సాధించాం. డిమాండ్ ను 6,784 మెగావాట్ల నుండి 9,453 మెగావాట్లకు పెంచాం. వినియోగాన్ని 40,174 మిలియన్ యూనిట్ల నుండి 54,555 మిలియన్ యూనిట్లకు పెంచాం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ కోతలు విధించలేదు. టారిఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించాం. తలసరి వినియోగాన్ని 1,003 యూనిట్ల నుండి 1,234కు పెంచాం. 17 శాతం తలసరి వినియోగాన్ని పెంచాం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన ఐపీడీఎస్, డీడీయూజీజేవై, యుడిఏవైతో పాటు అందరికీ విద్యుత్ అనే కార్యక్రమాలు చేపట్టి కేంద్రం నుండి రూ.5 వేల కోట్లను గ్రాంట్ కింద రాష్ట్రానికి తీసుకొచ్చాం. 2004కు ముందు ప్రపంచ బ్యాంక్ నుండి కూడా గ్రాంట్ తెచ్చాం. 2004 ముందు మేము తెచ్చిన సంస్కరణలే రాజశేఖర్ రెడ్డికి ఉపయోగపడ్డాయి’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.  

CM Chandrababu released a white paper on energy sector GVR

మా హయాంలో 145 అవార్డులు...

‘‘థర్మల్ యూనిట్స్‌ను రెండింటిని కొత్తవాటిని తీసుకొచ్చాం. ఏపీ జెన్‌కో సామర్థ్యాన్ని 4,114 నుండి 7,213 మెగావాట్లకు పెంచాం. ట్రాన్స్ మిషన్ సామర్థ్యాన్ని 29,863 నుండి 46,987 మెగా ఓల్ట్ ఆంప్స్‌కు పెంచాం. ఇన్‌స్టాల్ రీ-ఎనర్జబుల్ కెపాసిటీ, సోలార్, విండ్ పవర్, జనరేషన్ కెపాసిటీని ఐదేళ్లలో పెంచాం. ట్రాన్స్ కో 12, జెన్ కో 27, ఈస్ట్రన్ పవర్ 48, ఎన్ఆర్ఈడీసీఏపీ 43, ఏపీఎస్పీడీసీఎల్ 9, ఇలా విద్యుత్ రంగంలో మొత్తం 145 అవార్డులు సాధించాం. విద్యుత్ వినియోగాన్ని ఉత్తమంగా అమలు చేసినందుకు ఈ అవార్డులు సాధించాం. 2019-24 మధ్య గత ప్రభుత్వం వినియోగదారులపై రూ.32,166 కోట్ల భారం మోపింది. వీటీపీఎస్, కెటీపీఎస్ ఆలస్యం వల్ల రూ.12,816 కోట్లు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రాలిక్ కాంట్రాక్ట్ మార్చడం వల్ల 2023కి పూర్తికావాల్సి ఉన్నా పూర్తి కాకపోవడంతో రూ.4,737 కోట్లకు భారం పెరిగింది. సెకీ సోలార్ వల్ల, అప్పులు వడ్డీలు, పవర్ స్టేషన్ కెపాసిటీ తగ్గించడం, నిలిపివేత కారణంగా మొత్తంగా రూ.47,741 కోట్లు ప్రజలపై భారం పడింది.  ఒక అసమర్థ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా శాపంగా మారిందో ఇదొక కేస్ స్టడీ. ఈ అప్పులన్నీ ప్రజల నుండే చెల్లించాలి. పెట్టుబడి దారులకు నమ్మకం పోవడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. సోలార్ వాడుకుంటే కరెంట్ మనకు వచ్చేది..కానీ వాడకుండా రిజెక్ట్ చేశారు. వినియోగించని కరెంట్ కు కూడా కోర్టు ఆదేశాలతో రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 21 విండ్, ఇతర ఒప్పందాలను రద్దు చేయడం వల్ల కూడా భారం పడింది. రాజధానిలో కాంట్రాక్ట్ వర్క్ రూ.1315 కోట్లుకు గాను రూ. 406 కోట్లు ఖర్చు అయింది. ఆ పనులు రద్దు చేయడం వల్ల రూ.281 కోట్లు అదనంగా భారం పడుతోంది. హిందూజా ప్రాజెక్ట్ షెడ్యూల్ కాకపోవడం సుప్రీంకోర్టుకు వెల్లడంతో రూ.1,235 కోట్లు, విండ్-సోలార్ విద్యుత్ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవడంతో అదనంగా రూ.500 కోట్లు భారం పడడంతో పాటు రూ.16,699 కోట్లు టారిఫ్ పెరిగింది. ట్రూ అప్ ఫూయల్ పేరిట రూ.5,886 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్ కింద రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.5,604 కోట్లు ఇలా అన్నీ కలిపి రూ.32,166 కోట్లు ప్రజలపై భారం వేశారు. ట్రూ అప్, ఫూయల్ పదాలన్నీ కొత్తగా వింటున్నా. గత ప్రభుత్వం మోపిన భారం పేదలపైనే ఎక్కువ పడింది. 1.53 కోట్ల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. రూ.17,137 కోట్లు ట్రూ అప్, ఫ్యూయల్ లో ఇంకా పెండింగులో ఉన్నాయి. నెలకు 50 యూనిట్లు వాడేవారికి రూ.101 నుండి రూ.199లకు ఛార్జీలు పెరిగాయి. 300 యూనిట్లు వాడే వారికి రూ.1573 నుండి రూ.2,037కు భారం పెరిగింది. పెత్తందారు అని మాట్లాడుతాడు..ఆ పెత్తందారు చేసిన ఘనకార్యానికి పేదలు చితికిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందున్న రుణాలు రూ.62,826 కోట్లు.. ఐదేళ్లలో రూ.1,12,422 కోట్లకు పెంచారు. ప్రభుత్వ సబ్సీడీ బకాయిలు కూడా పెరిగాయి. రూ.7,680 కోట్ల నుండి రూ.12,681 కోట్ల సబ్సీడీ పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో రావాల్సిన బకాయిలు కూడా రూ.5,265 నుండి రూ.15,157 కోట్లకు పెరిగింది. తెలంగాణ నుండి రూ.7,300 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిల రూపంలో మొత్తం రూ.52 వేల కోట్లు రావాల్సి ఉంది'' అని సీఎం చంద్రబాబు వివరించారు. 

CM Chandrababu released a white paper on energy sector GVR

ఎన్నడూ చూడనంతగా విధ్వంసం...

‘‘వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తులకు పరిపాలించే అర్హత ఉందా..? అలాంటి వారిని సపోర్టు చేస్తారా..? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)ను 55 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ.2,029 కోట్లు, కృష్ణపట్నంను 44 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ.2,035 కోట్లు అదనంగా ఖర్చు అవుతోంది. రూ.3,800 కోట్లతో 17వేల మెగా యూనిట్లు కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.12,816 కోట్లు అదనపు భారం పడింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల కారణంగా అదనంగా రూ.12,250 కోట్లు భారం పడింది. మా హయాంలో డిస్కమ్‌లకు ‘ఎ’ రేటింగ్ వస్తే గత ప్రభుత్వంలో ‘సీ’ లు, ‘డీ’లు వచ్చాయి. రేటింగ్ బాగుంటే రుణాలు ఇస్తారు. కానీ రేటింగ్ తగ్గడంతో వడ్డీ రేట్ 1.11 శాతం పెరగడంతో ఐదేళ్లలో రూ.2,442 కోట్ల భారం పడింది. విద్యుత్ సంస్థలోని డబ్బులు కూడా బేవరేజ్ కార్పొరేషన్ కు మళ్లించారు. ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ కూడా వారికి తెలియకుండా మళ్లించారు. లోయెస్ట్ పవర్ వల్ల గ్రోత్ రేట్ తగ్గింది. ఎనర్జీ రంగంలో మార్పులు వస్తున్నాయి. అన్నింటినీ అధ్యయనం చేయాలి. 3.0 విద్యుత్ సంస్కరణలో ఎలా రీ స్ట్రక్చర్ చేయాలో ఆలోచిస్తున్నాం. నా జీవితంలో వ్యవస్థలు ఇంతలా విధ్వంసం అవ్వడాన్ని ఎప్పుడూ చూడలేదు. 2014లో ఉన్న విద్యుత్ కొరతను అధిగమించి ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భారం లేకుండా చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం. విద్యుత్ రంగం శ్వేతపత్రం చాలా ముఖ్యమైంది’’ అని సీఎం వివరించారు.

చర్యలు తప్పదు...

‘‘ఒక దుర్మార్గుడు చేసిన పనికి విద్యుత్ రంగం నాశనమైంది. మద్యం పై ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చారు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడని దుర్మార్గ పాలనను గత ఐదేళ్లలో చూశాను. అధికారులు ఎవరు సరిగా పని చేయకపోయినా చర్యలు ఉంటాయి. కొందరు రికార్డులు కూడా సరిగా లేకుండా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకూడదు..నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందించాలి.  నాకు ఒక్క ఫిర్యాదు రావడానికి కూడా వీల్లేదు. అన్ని రంగాల కంటే విద్యుత్ రంగంలో పని చేసే వారికే జీతాలు ఎక్కువ ఉంటాయి. తద్వారా ప్రజల కోసం పని చేయాలి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తే ఇల్లు, పొలాలకు వినియోగించుకుని కూడా ప్రభుత్వానికి కూడా విక్రయించుకోవచ్చు. రానున్ను రోజుల్లో ఇవన్నీ పరిశీలిస్తాం. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను కమిటీ చూసుకుంటుంది. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వ్యవస్థకు ఛాలెంజ్ గా మారారు. ఐదేళ్లుగా దోచిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనగలిగే స్థాయిలో ఉన్నారు. మా ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా, రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగినా బెదరదు. ఆదాయం పెంచాలి...పెంచిన ఆదాయం ప్రజలకు ఖర్చు చేయాలి. ప్రజాస్వామ్యం, ప్రజలు, కోర్టులు ఉన్నాయి...ఉన్నట్టుండి ఏదన్నా చేయాలంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఖజానాలో డబ్బులు లేవు. ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్ర మంత్రులను సహకరించాలని కోరాను. ఇప్పుడు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. వైసీపీ నేతలకే కడుపుమంటగా ఉంది’’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios