మానభంగం చేసిన వారికి అదే చివరి రోజు: చంద్రబాబు

cm chandrababu naidu interaction with home guards
Highlights

మానభంగం చేసిన వారికి అదే చివరి రోజు: చంద్రబాబు

నేను చీఫ్ మినిస్టర్‌ను కాదు.. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు టీమ్ లీడర్‌ని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో హోంగార్డుల ఆత్మీయ అభినందనకు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం వారినుద్దేశించి మాట్లాడారు.. హోంగార్డులంటే అందరికి చిన్న చూపు ఉందని.. వారి గౌరవాన్ని పెంచేందుకు అన్ని రకాల చర్యలు తసీుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు..

వారి వేతనాన్ని రూ.9 వేలు నుంచి రూ.18 వేలు చేశామని.. ఉగ్రవాద చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.30 లక్షలు.. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.2 నుంచి 12 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రం విడిపోకపోయుంటే మీ అందరికి మరంత మెరుగైన సేవలు అందజేసేవారమని.. కానీ కేంద్రం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించి.. అప్పు నెత్తిన పెట్టి కట్టుబట్టలతో విజయవాడకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశాంతత ఉన్న చోటకు పెట్టుబడులు తరలివస్తాయని.. ఆ ప్రశాంతతను నెలకొల్పడంతో హోంగార్డులదే కీలకపాత్ర అని సీఎం అన్నారు. పెట్టుబడులు వస్తే ప్రజలకు ఉద్యోగావకాశాలు వస్తాయని.. ఆదాయాలు పెరుగుతాయన్నారు.. పోలీసు విధుల్లో విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలని.. రోజు వారి కార్యకలాపాలు.. వ్యవస్థ గురించి వారికి వివరించాలని.. స్వచ్ఛంధంగా ముందుకు వచ్చే వారి సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు..

ప్రతినెలా క్రైమ్ బులెటిన్ విడుదల చేసే పద్ధతి రావాలన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయని.. టెక్నాలజీ సమస్యలు తెస్తోందని.. ఆడబిడ్డలపై చేయి వేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు కావాలని సీఎం హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని.. అన్ని రకాల సహకారాలు అందిస్తామని  చెబుతున్నా.. కేంద్రంలో చలనం లేదన్నారు. లేనిపక్షంలో తామే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటామని చంద్రబాబు  అన్నారు. త్వరలోనే హోంగార్డులందరికి ఇళ్లు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోలీసులంతా ఫిట్‌గా ఉండాలని.. అందరూ ఈత నేర్చుకోవాలని కోరారు.  

loader