నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని విడేందుకు సిద్ధమవ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. కార్యకర్తలతో, అనుచరులతో సమావేశమైన ఆయన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.. ఈ విషయం సీఎం వద్దకు వెళ్లడంతో ఆయన స్పందించారు..

పార్టీ మార్పు విషయంలో ఆనం చేసిన వ్యాఖ్యలు నేను కూడా పేపర్లలో చూశానని.. ఆయన అలా ఎందుకు అన్నారు..? ఆయనకు ఎక్కడ గౌరవం ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదన్నారు.. రామనారాయణ రెడ్డి సీనియారిటీని గౌరవించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చాం.. ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలనుకున్నాం.. కానీ ఆయన అన్న వివేకానందరెడ్డి కూడా నన్ను కలిసి తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని కోరారని.. ఇద్దరూ అడగటంతో ఏం చేయాలో అర్ధం కాలేదని.. అందుకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని తనను కలిసిన నెల్లూరు జిల్లా నేతలతో చంద్రబాబు అన్నారు.

కాగా, తన సోదరుడు ఏ నిర్ణయం తీసుకొన్నా తనకు సంబంధం లేదని.. తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆనం జయకుమార్‌రెడ్డి సీఎంకు చెప్పారు. ఈ సందర్భంగా జయకుమార్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.