CM Chandrababu meets Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ సుంకాలు, ఆక్వా ఎగుమతులపై కీలక నిర్ణయాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

CM Chandrababu meets Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మాట్లాడారు. మరీ ముఖ్యంగా రైతులు, వ్యవసాయ, ఎగుమతి సమస్యలపై విస్తృత చర్చ జరిగింది.

రాష్ట్రానికి చెందిన ప్రధాన సాగు ఉత్పత్తులు, ఎగుమతులపై పెరుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్ల సహాయం కోరిన చంద్రబాబు

పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, టొబాకో బోర్డు ద్వారా పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు చట్ట సవరణ చేపట్టాలని కోరారు.

పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు పై ఆందోళన

పామాయిల్ దిగుమతులపై కేంద్రం సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై సీఎం చంద్రబాబు గోయల్‌కు అభ్యంతరం తెలిపారు. దీని వల్ల రాష్ట్ర పామాయిల్ రైతులకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. దిగుమతి సుంకం తగ్గించడం కేంద్ర నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను కూడా విఘాతం కలిగిస్తుందని ఆయన తెలిపారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాలపై చర్చలు అవసరం

అమెరికా ఆక్వా ఉత్పత్తులపై విధించిన 27 శాతం దిగుమతి సుంకం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఎం చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాతో చర్చలు జరిపేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపు అభ్యర్థన

ప్రస్తుతం మ్యాంగో పల్ప్‌పై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.