వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా పర్యటనలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆయన కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.. అయితే ఈ ప్రమాదంలో జగన్ వాహనానికి ఏమీ కాలేదు. ఇతర వాహనాల్లోని వారు గాయపడినట్లు తెలుస్తోంది.
పోలీస్ ఆంక్షలమధ్య జగన్ పర్యటన
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో మొంథా తుపాను తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి... అలాగే ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది... ఈ ప్రాంతాలను ఇవాళ (మంగళవారం) వైఎస్ జగన్ పర్యటిస్తూ దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తున్నారు… నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నారు. పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల మీదుగా ఆయన పర్యటన సాగుతోంది.
పోలీసుల ఆంక్షల మధ్య వైసిపి అధినేత పర్యటనకు కొనసాగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు జిల్లాకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు పోలీస్ ఆంక్షలను లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జగన్ కాన్వాయ్ ప్రమాదం… భారీగా ట్రాఫిక్ జామ్
ఈ క్రమంలోనే భారీ వాహనశ్రేణితో వెళుతుండగా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ప్రమాదం జరిగింది. జగన్ కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఆయా కార్లలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జగన్ కారుకు ఏమీ కాలేదు.. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
