శ్రీకాకుళం: వినాయక నిమజ్జనం సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో చోటు చేసుకొంది.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ వీధికి చెందిన దాసరి రాంబాబు కుటుంబంపై కంచరవీధికి చెందిన హిరంబో కుటుంబం దాడికి దిగింది. ఈ నెల 25వ తేదీ రాత్రి హిరంబో వర్గం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఆట పాటలతో వెళ్తున్నారు.

అయితే అదే సమయంలో రాంబాబు తన పిల్లలను నిద్రపుచ్చుతోంది. పిల్లలు నిద్రపోతున్నారు... ముందుకు వెళ్లి చిందులేయాలని రాంబాబు భార్య వినాయక విగ్రహాన్ని నిమజ్జం కోసం తీసుకెళ్తున్న వారిని కోరింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. రాంబాబు భార్యతో పాటు రాంబాబు అక్కపై హిరంబో వర్గీయులు దాడికి దిగారు. ఈ సమయంలో రాంబాబు ఇంట్లో లేడు.

ఇంటికి వచ్చిన రాంబాబుకు కుటుంబసభ్యులు విషయం చెప్పారు. ఇదే విషయమై రాంబాబు హిరంబో ఇంటి వద్దకు వెళ్లి ఇదే విషయమై నిలదీశాడు. హిరంబో వర్గీయులు రాంబాబుపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.