ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల మధ్య వివాదం ముదిరింది. కోర్టు తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల మధ్య కొత్త వివాదం నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఉద్యోగ సంఘాల మధ్య హీట్ పెరిగింది.

నిన్న ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇవాళ వెంకట్రామిరెడ్డికి కౌంటరిచ్చారు బొప్పరాజు. సచివాలయంలోకి ఎవరు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ప్రవర్తన సరిగా లేదని ఫైరయ్యారు.

వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కలిసి బీజేపీని ఓడించాలని గతంలో దీక్షలు చేశారని బొప్పరాజు విమర్శించారు. పంచాయతీ ఎన్నికలపై వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలతో చులకన అయ్యారని బొప్పరాజు మండిపడ్డారు.

Also Read:ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తేల్చిచెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మేరకు నిర్వహించాల్సిందేనని.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయితే తప్ప.. ఎన్నికల విధుల్లో  పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా చెబుతుండడంతో సీఎస్‌ మంగళవారం వారితో అత్యవసరంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో ఆయా సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు కేఆర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని.. మరి కొద్ది రోజులు వాయిదా వేసి.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంఘాల నేతలు కోరారు. దీనికి ఆదిత్యనాథ్‌ దాస్‌ అంగీకరించలేదు. ఈ సమయంలో షెడ్యూల్‌ వాయిదా కుదరదన్నారు.