సీఐఎస్‌ఎఫ్‌‌కు చెందిన కానిస్టేబుల్  ఒకరు పాకిస్తాన్ యువతి హానీ ట్రాప్‌లో పడినట్టుగా తెలుస్తోంది. 

సీఐఎస్‌ఎఫ్‌‌కు చెందిన కానిస్టేబుల్ ఒకరు పాకిస్తాన్ యువతి హానీ ట్రాప్‌లో పడినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంత రహస్య సమాచారం కూడా చేరవేసినట్టుగా సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కదలికలపై అనుమానం రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. వివరాలు.. అనుమానిత వ్యక్తి కపిల్ కుమార్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు. కపిల్ కుమార్ గతంలో రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కపిల్ కుమార్‌పై హనీ ట్రాప్ వల విసిరింది. తమీషా అనే మహిళతో కపిల్‌ కుమార్‌కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు కీలక సమాచారం చేరవేసినట్టుగా సమాచారం. 

అయితే కొంతకాలంగా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కదలికలపై ఉన్నతాధికారులు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే అతడు హానీ ట్రాప్‌ ద్వారా భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు చెందిన కీలక సమాచారం పాక్ గూఢచార సంస్థకు చేరవేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరంతో పాటు పలు సెక్షన్ల కింద విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. ఇక, అతని వద్ద నుంచి మొబైల్స్‌ను సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.