అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ విషయమై  సీఐడీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ లేఖ డ్రాఫ్ట్ చేసిన ఆధారాలను లేకుండా చేసే ప్రయత్నం జరిగిందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం సెక్రటరీకి రాసిన లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీని లేఖ రాశారు. ఈ విషయమై  సీఐడీ  విచారణ జరుపుతోంది.

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టుగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. ఈ వాంగ్మూలం ప్రకారంగా తమకు కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు.

మార్చి 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం మెయిల్ ఐడీ అడిగితే తాను రమేష్ కుమార్ కు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారన్నారు. ఆ మరునాడే మార్చి 18న ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు.

మార్చి 18వ తేదీన  సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వద్ద ఉన్న లాప్ ట్యాప్ లో డ్రాఫ్ట్ ను తనకు డిక్టేట్ చేస్తే దాన్ని తన లాప్ ట్యాప్ లో కంపోజ్ చేశానని చెప్పారు.  

ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసి దానిపై రమేష్ కుమార్ సంతకం తీసుకొన్నట్టుగా సాంబమూర్తి చెప్పారని  సునీల్ కుమార్ తెలిపారు.ఈ కాపీని పెన్ డ్రైవ్ లో కూడ కాపీ చేసినట్టుగా తమకు ఆయన చెప్పారన్నారు. ఈ కాపీని తాను మాజీ ఎస్ఈసీ మొబైల్ కు వాట్సాప్ ద్వారా పంపితే  దాన్ని జీ మెయిల్ ద్వారా మెయిల్ చేసి ఉంటారని సాంబమూర్తి తమకు వివరించారన్నారు.

సాంబమూర్తి ఉపయోగించిన ల్యాప్ టాప్ లో కేంద్ర హోంశాఖ సెక్రటరీకి రాసిన లేఖ డ్రాఫ్ట్ డిలీట్ చేశారు. ఈ లేఖను డెస్క్ టాప్ ద్వారా పెన్ డ్రైవ్ ను ఉపయోగించి ప్రింట్ తీశారని సీఐడీ అధికారులకు సాంబమూర్తి తెలిపారు. అయితే డెస్క్ టాప్ ను ఫార్మాట్ చేశారు. అంతేకాదు పెన్ డ్రైవ్ ను కూడ ధ్వంసం చేసినట్టుగా ఎన్నికల అసిస్టెంట్ సెక్రటరీ చెప్పినట్టుగా ఆయన తెలిపారు.

అధికారిక కమ్యూనికేషన్ కు సంబంధించిన ఈ లేఖను ఎందుకు డిలీట్ చేశారో సాంబమూర్తి సమాధానం చెప్పలేదన్నారు. అంతేకాదు పెన్ డ్రైవ్ ధ్వంసం చేయడం వెనుక కారణం కూడ తమకు చెప్పలేదన్నారు.దీంతో ఈ లేఖ బయట జరిగిందనేందుకు అనుమానాలు లేకపోలేదన్నారు.ఈ విషయమై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.