విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమ భార్య సుజాతపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూక్జా కేసులు అందిన ఫిర్యాదు మేరకు ఎంఎల్ఏపై పోలీసులు కేసు పెట్టారు. బోండా పై ఇప్పటికే పలు ఆరోపణలున్నా పోలీసు కేసు దాకా వెళ్ళింది లేదు. అయితే స్వాతంత్ర్య సమరయోధులకిచ్చిన భూమిపై ఎంఎల్ఏ కన్ను పడిందట. అప్పు ఇస్తామంటూ భూ యజమాని రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తికి ఎంఎల్ఏ గాలం వేశారట. భూమి తనఖా పేరుతో రిజిస్ట్రేషన్  కార్యాలయానికి తీసుకెళ్ళి అవసరమైన సంతకాలన్నీ చేయించుకున్నారట ఎంఎల్ఏ.

తర్వాత కోటేశ్వరరావు నుండి తాను భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు కూడా సృష్టించారట. భూమి విలువ ప్రస్తుతం సుమారు రూ. 40 కోట్లని సమాచారం. అయితే, జరిగిన మోసాన్ని తెలుసుకున్న కేటేశ్వరరావు బోండాకు అడ్డం తిరిగారు. దాంతో ఎంఎల్ఏ బెదిరింపులకు దిగారు. తాను చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరింపులు మొదలయ్యాయి.

దాంతో చేసేది లేక ఎంఎల్ఏతో పాటు ఆయన అనుచరులపై భూ యజమాని సిఐడి వద్ద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారించిన పోలీసులు ఎంఎల్ఏతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. బోండా తదితరుల నుండి ప్రాణభయం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలంటూ కోటేశ్వరరావు పోలీసు కమీషనర్ ను ఆశ్రయించారు.