విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. విజయవాడలో తమదే పై చేయి ఉండాలంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోన్నాయి. ఇప్పటికే కృష్ణా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారం వైసీపీని ఓ కుదుపు కుదిపేసింది. 

కృష్ణా జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుడుగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడటంతో అదే జిల్లాలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న మరో నేతపై టార్గెట్ చేసింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గెలవకూడదన్న కసితో ఉన్నారు సీఎం చంద్రబాబు. దీంతో ఆ అభ్యర్థిని ఓడించేందుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసే పనిలో పడ్డారు. 

ఇంతకీ చంద్రబాబుకు అంత కోపం రప్పించిన వైసీపీ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా...ఇంకెవరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరికం చేసి పక్కలో బల్లెంలా తయారైన నానిని ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కకకుండా చెయ్యాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. 

తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని తననే తిడతారా అంటూ చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాస్తవానికి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ఆరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే గుడివాడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మూడు పర్యాయాలు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొడాలి నాని కాస్త గుడివాడ నానిగా మారిపోయారు. 

కృష్ణా జిల్లాలో గుడివాడ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. గుడివాడ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొమ్మిది సార్లు విజయదుందుభి మోగించింది. కేవలం రెండు సార్లు మాత్రమే పరాజయం పాలైంది. 

ఇకపోతే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గుందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటుగాడిలా వెళ్లావ్, గుడ్డలూడదీసి కొట్టారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తిట్టని తిట్లు తిట్టారు. గుడివాడలో తెలుగుదేశం జెండా కనబడనివ్వనంటూ ప్రతిన బూనారు. 

కొడాలి నాని వ్యాఖ్యలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన గుడివాడ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవెయ్యాలని, పార్టీకి పునర్వైభవం తీసుకురావలి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టే బలమైన అభ్యర్థికోసం వేట ప్రారంభించారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు త్వరలో గుడివాడ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.  

కొడాలి నాని దూకుడికి కళ్లెం వేసేందుకు రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్‌ లలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడను తెలుగుదేశం ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. 
 
రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లను పరిశీలించిన చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గంలో పలుమార్లు సర్వేలు నిర్వహించారు. సర్వేలు రావి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొంటారన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. 

రావి వెంకటేశ్వరరావు ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించే వ్యక్తి అని నాని దూకుడుకు కళ్లెం వెయ్యగలరా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. అయితే యువ నాయకుడు దేవినేని అవినాష్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తోంది. అవినాశ్‌ అయితే నాని స్పీడ్ కి బ్రేక్ లు వేయోచ్చని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

ఏది ఏమైనప్పటికీ గుడివాడ టిక్కెట్ ను ఖరారు వీలైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు ఆదేశించే అవకాశం లేకపోలేదు. 

కృష్ణా జిల్లా నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రావి వెంకటేశ్వరరావుని బరిలోకి దించాలా లేక దేవినేని అవినాశ్ ను బరిలో దించాలా అన్న అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు.