చిత్తూరు: తన కూతురితో ఏకాంతంగా ఉండడం చూసి ధనశేఖర్ ను హత్య చేసినట్టుగా బాబు పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. తన కూతురితో ప్రేమలో ఉన్న ధనశేఖర్ ను బాబు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో చోటు చేసుకొంది. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామంలో ఓ యువతిని ప్రేమించినందుకు ధనశేఖర్ అనే యువకుడిని  యువతి తండ్రి బాబు హత్య చేశాడు. శుక్రవారం నాడు బాబును పోలీసులు  అరెస్ట్ చేశారు. 

also read:చిత్తూరులో దారుణం: కూతురిని ప్రేమించాడని ముక్కలు ముక్కలుగా నరికాడు

నాలుగు రోజుల క్రితం ధనశేఖర్ ను  హత్య చేసిన రోజున చోటు చేసుకొన్న ఘటనలను బాబు పోలీసులకు వివరించారు. తన కూతురితో ధనశేఖర్ ఏకాంతంగా ఉండగా చూసి అతడిని చితకబాదితే మృతి చెందినట్టుగా నిందితుడు పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. మృతదేహాన్ని బావిలో వేసినట్టుగా చెప్పారు.మృతదేహం నీటిలో తేలితే అందరికీ తెలిసే అవకాశం ఉందని భావించానని చెప్పాడు. బావి నుండి డెడ్ బాడీని తీసి ముక్కలు ముక్కలుగా నరికి తన పొలంలోనే ఆ శరీరభాగాలను పూడ్చిపెట్టినట్టుగా పోలీసులకు బాబు వివరించారని సమాచారం. 

బాధిత కుటుంబం ఆందోళన

ఇదిలా ఉంటే ధనశేఖర్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ధనశేఖర్ ను అన్యాయంగా పొట్టనబెట్టుకొన్నారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.