తనను నమ్ముకుని పార్టీలో చేరిన వారిని పూర్తిగా నిరాసపరిచిన చిరంజీవి పదేళ్ళ గ్యాప్ తర్వాత కూడా సినీ అభిమానుల మాత్రం బాగానే ఆలరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా విఫలమైనా పదేళ్ళ తర్వాత ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో మాత్రం సక్సెస్ అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయటం ద్వారా చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అందుకు దాదాపు 35 ఏళ్ళ సినిమా పునాదిపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. తనకన్నా ముందు సినిమా ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ లాంటి వారిని స్పూర్తిగా తీసుకున్నారు.
అయితే, సినిమా ప్రపంచం వేరు రాజకీయాలు వేరని పార్టీ పెట్టిన కొద్ది కాలానికే చిరంజీవికి త్వరలోనే అర్ధమైంది. ఏదేమైనా రాజకీయాల్లో మాత్రం చిరంజీవి అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన పిఆర్పికి 17 సీట్లు వచ్చాయి. పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్ధానాల నుండి పోటీ చేసిన చిరంజీవి స్వస్ధలమైన పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో కూడా చావు తప్పి కన్ను లొట్టపోయిన పద్దతిలో విజయం సాధించారునుకోండి అదివేరే సంగతి.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీని నడపలేక చేతులెత్తేసారు. చివరకు పార్టీ మొత్తాన్ని చాపచుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. ప్రతిఫలంగా రాజ్యసభ సభ్యుడై కేంద్రంలో సహాయమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా రాష్ట్రంలో ఏకంగా భూస్ధాపితమే అయిపోయింది. దాంతో చాలాకాలంగా చిరంజీవికి పూర్తి విశ్రాంతే.
ఆ సమయంలోనే చిరంజీవి ఆలోచనలు మళ్ళీ సినిమా రంగంపైకి మళ్లాయి. దానికితోడు తన కుటుంబం నుండి పవన్ కల్యాన్ కాకుండా కుమారుడు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ, సాయిధరమ్ తేజ్ తదితరులు సినిమా రంగంలో రాణిస్తున్నారు. దాంతో మళ్ళీ సినిమాల్లో నటించాలనే తహతహ మళ్ళీ మొదలైంది. ఎట్టకేలకు తమిళ సినిమా ‘కత్తి’ ఆధారంగా రీమేక్ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించారు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. దాంతో రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన చిరంజీవి 10 ఏళ్ళ గ్యాప్ వచ్చినా సినిమాల్లో మాత్రం సూపర్ హిట్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇదే ఊపుతో మరికొన్ని సినిమాల్లో నటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తనను నమ్ముకుని పార్టీలో చేరిన వారిని పూర్తిగా నిరాసపరిచిన చిరంజీవి పదేళ్ళ గ్యాప్ తర్వాత కూడా సినీ అభిమానుల మాత్రం బాగానే ఆలరిస్తున్నారు.
