కాంగ్రెసుకు షాక్, తమ్ముడికి చేయూత: రాజకీయాలకు చిరంజీవి రాం రాం?

Chiranjeevi may quit politics
Highlights

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం ముమ్మరమైంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టడం వల్లనే కాకుండా మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచనతో ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అమరావతి: కాంగ్రెసు మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం చిరంజీవి అభిమానులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమై వారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడంతో ఆ ప్రచారం మరింత ముమ్మరమైంది. 

చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 విజయం సాధించడంతో ఆయన పోగొట్టున్న చోటే వెతుక్కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ఆయన రాజకీయాల్లో మళ్లీ బిజీ అవుతారని అనుకున్నారు.

కానీ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని తెలుస్తోంది. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుంటే కాంగ్రెసుకు పెద్ద దెబ్బ త గిలినట్లే. పవన్ కల్యాణ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆయన రాజకీయాల విషయంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. తన వంతు సాయం తమ్ముడికి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 

చిరంజీవికి సన్నిహితుడైన స్వామి నాయుడు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో చిరంజీవి ఆపరేషన్ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. స్వామి నాయుడి ద్వారా చిరంజీవి అభిమానులను జనసేనకు అనుకూలంగా మలిచే ప్రయత్నం సాగుతున్నట్లు తెలుస్తోంది. 

చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు పవన్ కల్యాణ్ రాజకీయాలకు చేదోడువాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ రాజకీయాలకు జైకొట్టడానికి సిద్ధపడినట్లు కూడా చెబుతున్నారు. బాబాయ్ పిలిస్తే తాను జనసేన కోసం ప్రచారం చేస్తానని రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కల్యాణ్ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు.

ఈ స్థితిలో రాజకీయాల నుంచి తప్పుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ కు సాయపడే ఉద్దేశం మాత్రమే కాకుండా సినిమాల్లో తిరిగి బిజీ కావాలని చిరంజీవి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సైరా నరసింహా రెడ్డి సినిమా ముగిసిన తర్వాత మరో సినిమా చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన కథ కోసం ఆయన అన్వేషణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. 

loader