హైదరాబాద్: రాజకీయాలపై కాంగ్రెసు రాజ్యసభ మాజీ ఎంపి చిరంజీవికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య విభేదాలకు తెర పడనుంది. కుటుంబ సభ్యులుగా తామంతా ఒక్కటేనని, అయితే తమ్ముడి రాజకీయాలతో తాను ఏకీభవించలేనని గతంలో చిరంజీవి ప్రకటించారు. అయితే, విభేదాలను పక్కన పెట్టి చిరంజీవితో చేతులు కలుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

అందుకు అవసరమైన ఏర్పాట్లను చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు జనసేనలో చేరనున్నారు. సోమవారం మధ్యాహ్నం చిరంజీవి అభిమానుల సమావేశమై జనసేనకు మద్దతు ప్రకటించనున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజకీయాలను బలపరిచేందుకు మెగా ఫ్యామిలీ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో పార్టీకి, చిరంజీవి అభిమానులకు మధ్య నాగబాబు వారథిగా పనిచేశారు. ఇప్పుడు జనసేన విషయంలో అదే పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అయితే, ప్రజారాజ్యం విషయంలో చేసిన పొరపాట్లను చేయకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కాగా, బాబాయ్ రాజకీయాలకు రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు తెలుపుతున్నారు.