టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా... చింతమనేని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో దూషించారని పెదవేగి పీఎస్‌లో జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చింతమనేనిపై ఇది రెండో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే తనను చింతమనేని, ఆయన అనుచరులు కొట్టారని రాచేటి జాన్ అనే హమాలీ నాయకుడు గతంలో ఫిర్యాదు చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గురువారం పినకడిమిలో దళిత యువకులపై  దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.